ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ దెబ్బకి టీడీపీతో పాటు జనసేన పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఆర్టీ ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకుంది. రెండు చాట్ల నుంచి పోటీచేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కూడా ఘోరంగా ఓడిపోవడంతో పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పార్టీని వీడుతున్నారు నాయకులు. తాజాగా పవన్‌కు ఊహించని షాక్ తగిలింది. జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ప్రకటించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కి లేఖ కూడా రాశారు.
వ్యక్తిగత కారణాలతో జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని, తక్షణం తన రాజీనామా లేఖను ఆమోదించాలని తన లిఖితపూర్వక లేఖలో కోరారు. మొన్నటి ఎన్నికల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి రావెల ఓడిపోయారు.ఈ స్థానం నుంచి విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మరో వైపు వైసీపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
గతంలో టీడీపీలో ఉన్న రావెల కిషోర్ బాబు మంత్రిగా పనిచేశారు. ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీని వీడి… జనసేన చెంతన చేరారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ తో ఎన్నికల్లో గెలవొచ్చనే భావనతో ఆయన జనసేనలో చేరారు. కాని ఎన్నికల్లో జనసేన పార్టీని ప్రజలు తిరస్కరించారు. రావెల ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో పార్టీని ఒక్కొక్కరు వీడుతున్నారు. మరి ఈ ఘటనపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
