ఔట్ లుక్ పత్రిక ప్రచురించిన ఒక వివాదాస్పద కథనంపై తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సీఎంవో అధికారిణి స్మితా సబర్వాల్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
ఆ కథనం అభ్యంతరకరంగా ఉండటంతో వారు ఆ పత్రికపై విరుచుకుపడ్డారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ పత్రిక కూడా విచారం వ్యక్తం చేసినట్టుగానే ఉంది. ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఔట్ లుక్ పత్రిక తనమీద ప్రచురించిన కథనంపై చట్టపరమైన చర్యలను కోరుతూ కోర్టుకు ఎక్కారు స్మితా సబర్వాల్. ఈ నేపథ్యంలో ఆమె కోర్టు ఖర్చులకు గానూ.. పదిహేను లక్షల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది!
ఇదే ఇప్పుడు వివాదం అవుతోంది. ఇలా ప్రభుత్వ సొమ్మును ఒక అధికారిణికి కేటాయించడం పట్ల కొంతమంది కోర్టుకు ఎక్కారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఖండిస్తూ వారు పిల్ లు దాఖలు చేశారు. ఇప్పటికే ఈ విషయమై రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు పడ్డాయి. ప్రజల సొమ్మును ఇలా అధికారుల కోర్టు ఖర్చులకు కేటాయించడాన్ని వారు తప్పుపడుతున్నారు. మరి ఈ విధంగా ఈ వివాదం ఎక్కడో మొదలై.. మరెక్కడికో వెళుతోంది. దీంతో దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అంతిమంగా ఈ వ్యవహారం గురించి కోర్టు ఏమని వ్యాఖ్యానిస్తుందో.. చూడాలి!