ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుకోవడానికి అన్ని రెడీ చేసుకున్న శశికళకు సుప్రీంకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత అక్రమాస్తుల కేసుపై తుదితీర్పు వెలువరించనున్నట్టు సుప్రీం స్పష్టం చేసింది. అయితే శశికళ ఈ కేసులో సహనిందితురాలిగా ఉన్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె అక్రమంగా చాలా ఆస్తులు దాచుకున్నారని ఆమె పై సుప్రీంకోర్టులో 1996లో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.
అయితే 2014లో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు జయలలితను దోషిగా నిర్దారించి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో శశికళ సహనిందితురాలిగా ఉండటం వల్ల ఆమెకు కూడా జైలు శిక్ష పడింది. ఇదే కేసులో కర్నాటక హైకోర్టు 2015లో జయలలితపై కేసును కొట్టేసి ఆమెకు విముక్తి కల్పించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే ప్రత్యేక కోర్టు తీర్పు వల్ల జయలలిత కొద్దికాలం ముఖ్యమంత్రి పీఠానికి దూరమైనా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విజయం సొంతం చేసుకొని మళ్లీ అధికారం చేపట్టింది.
జయలలిత మరణం తర్వాత శశికళ చాలా వ్యూహాత్మకంగా ఏఐడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ పదవి చేపట్టడంతో పాటు ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పదవి దక్కించుకునేందుకు సిద్దం అయ్యింది. ఈ నెపథ్యంలో ఇప్పుడు వారం రోజుల్లో వెలువడనున్న సుప్రీం తీర్పుతో శశికళ ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.