“సంపదను సృష్టించి పెట్టాను.. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ దే…” అంటూ తన గురించి తాను చాలా గొప్పగా చెప్పుకొన్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుపై తెలంగాణ రాష్ట్ర సమితి వారు విరుచుకుపడ్డారు.
బాబు మాట తీరును తీవ్రంగా ఖండించిన వారు.. తీవ్రాతి తీవ్రమైన మాటలతోనే బాబుపై విమర్శలు చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన మాజీ తెలుగుదేశం నేత, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ బాబుపై తీవ్రమైన వ్యాఖ్యానాలు చేశాడు.
“చంద్రబాబూ.. ఒకసారి మీ మొహాన్ని అద్దంలో చూసుకోండి..” అని వ్యాఖ్యానించాడు తలసాని. తెలంగాణ మిగులు బడ్జెట్ కు తనే కారణం అని చెప్పుకొంటున్న చంద్రబాబుకు అంత సీన్ లేదని తలసాని స్పష్టం చేశాడు. ఆయన ఒకసారి తన మొహాన్ని అద్దంలో చూసుకొంటే మంచిదని తలసాని వ్యాఖ్యానించాడు. చంద్రబాబుకు తెలంగాణ గురించి మాట్లాడటం కాదు.. చేతనైతే ఏపీలో సంపదను సృష్టించుకోవాలని తలసాని వ్యాఖ్యానించాడు.
చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ బాబులు ఇప్పుడు తమ కుటుంబ సంపదను పెంచుకోవడం పై దృష్టిసారించారని.. పట్టిసీమ వంటి ప్రాజెక్టుతో దోచుకొంటున్నారని.. తలసాని ఆరోపించాడు. మొత్తానికి తెలంగాణ మంత్రిగారు ఏపీ ముఖ్యమంత్రిగారిపై గట్టిగానే విమర్శలు చేశాడు!