శాసనసభ వర్షాకాల సమావేశాల చివరి రోజున కూడా సభలో గందరగోళం తప్పలేదు. అధికార, తెలుగుదేశం పార్టీల మధ్య రచ్చ కొనసాగింది. ఈ రచ్చలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీనే ముఖ్యపాత్రను పోషించడం విశేషం.
శుక్రవారం రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు అంశాన్ని ప్రస్తావించింది. ఆ వ్యవహారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర గురించి వివరణ ఇవ్వాలని వైకాపా డిమాండ్ చేసింది. దీనిపై తెలుగుదేశం పార్టీ సూటిగా సమాధానం చెప్పక సభలో గందరగోళం సృష్టించింది. ఓటుకు నోటు కుంభకోణంలో దాఖలైన చార్జిషీట్ లో తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు 24 చోట్ల ఉందని… వైకాపా నేతలు గుర్తు చేశారు.
దీనిపై తెలుగుదేశం నేతలు విరుచుకుపడ్డారు. జగన్ కు బాబు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. జగన్ అవినీతి పరుడు అని ఆరోపించారు. ఓటుకు నోటు కుంభకోణంలో చంద్రబాబు పాత్ర గురించి వివరణ అడిగితే.. తెలుగుదేశం వారు ఈ విధంగా ఎదురుదాడి చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. అనేక మంది తెలుగుదేశం నేతలు, ఎమ్మెల్యేలు ఎదురుదాడిని కొనసాగించారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు ఎలాంటి జోక్యం చేసుకొలేదు. కేవలం కొంతమంది తెలుగుదేశం నేతలే జగన్ పై విరుచుకుపడ్డారు. రచ్చ రచ్చ చేశారు.
తాము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా… తెలుగుదేశం నేతలు ఏదేదో మాట్లాడుతుండటంపై వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లు కూడా విరుచుకుపడ్డారు. స్పీకర్ పోడియంను చుట్టు ముట్టారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. మళ్లీ సమావేశం అయినా అలాంటి పరిస్థితులే కొనసాగాయి. దీంతో స్పీకర్ మళ్లీ పది నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత సమావేశం అయినా పరిస్థితి సద్దుమణగలేదు. దీంతో సభ మళ్లీ వాయిదా పడింది. మొత్తానికి శుక్రవారం రోజున ఓటుకు నోటు కుంభకోణం గురించి వైకాపా వాళ్లు ప్రస్తావించే సరికి తెలుగుదేశం తెగ ఇబ్బంది పడిపోయింది!