ఛత్తీస్ ఘడ్, విదర్భ, ఉత్తర తెలంగాణల మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్నడింది. దీంతో రానున్న రోజుల్లో తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ ఆవర్తనం ప్రభావంతో కరీంనగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో మరీ ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కేరళ నుంచి వచ్చే రుతుపవనాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించడంతో దీని ప్రభావంతో వర్షాలు భారీగానే కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీని కారణంగా బుధవారం నుంచి వర్షాల జోరు పెరగనుంది. సోమవారం నాడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలే కురిసాయి. రంగారెడ్డి జిల్లాలో ఆదివారం ప్రారంభమైన వర్షాలు సోమవారం నాడు కూడా కురిసాయి. మరోవైపు వర్షాల జోరు పెరగడంతో వ్యవసాయ పనులు కూడా షురూ అయ్యాయి.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ రైతులు విత్తనాలు వేసే పనిని ముమ్మరం చేశారు. ఇప్పటి వరకూ 11 లక్షల ఎకరాల్లో రైతులు విత్తనాలు వేసారని, అందులో ఐదు లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసారని అధికారులు చెబుతున్నారు.