తెలంగాణలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధను లాభాల బాటలో నడిపిద్దామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. ఆర్టీసి నష్టాలపై అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో సిఎం పాల్గొన్నారు. సంస్ధను లాభాల బాట పట్టించడం కష్టం కాదు. రాదు అనుకున్న తెలంగాణను సాధించుకున్నాం. అలాగే ఆర్టీసిని కూడా పరిరకషించుకుందాం అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్ధలను కాపాడే బాధ్యత తీసుకున్నానని, దీంట్లో భాగంగానే విద్యుత్ సంస్ధలను బలోపేతం చేస్తున్నామని ఆయన అన్నారు.
ఆర్టీసిని లాభాల బాట పట్టించడం కష్టసాధ్యం కాదని ఆయన అన్నారు. ఆర్టీసిని బలోపేతం చేసేందుకు, లాభాల బాట పట్టించేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా ఆర్టీసిలో పుట్టి పెరిగిన రమణారావును సంస్ధ ఎండిగా నియమించామని కెసిఆర్ చెప్పారు. ఇక నుంచి ప్రతి డిపో నుంచి తిరుపతి, శిరిడిలకు బస్సులు వేయాలని, పల్లె వెలుగులో చిన్న బస్సులు నడపాలని ఆయన సూచించారు. ఇక ప్రధానమైన ఛార్జీల పెంపు విషయంలో అశాస్త్రీయత తగదని, ఒకేసారి ఛార్జీలు పెంచకుండా దశల వారీగా పెంచే కార్యక్రమం చేపట్టాలని అన్నారు.
కొత్త పద్దతులు అవలంభించాలని, అలాగే ప్రయోగాత్మకంగా సంస్ధను నిర్వహించాలని కెసిఆర్ అన్నారు. ఇంతకు ముందు రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తాను డిపోల వారీగా సమీక్షలు జరిపే వాడినని, అలాగే ఆర్టీసిని లాభాల బాట పట్టించానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 95 డిపోలుంటే అందులో ఐదు డిపోలు మాత్రమే లాభాల్లో నడవడం సిగ్గు చేటని ఆయన అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఎండి రమణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.