తన గురించి గొప్పలు చెప్పుకోవడంలో తెలుగుదేశం అధినేత ఎలాంటి మొహమాటానికీ పోవడం లేదు. తన డబ్బాను తనేకొట్టుకోవాలి.. తన గొప్పవాడిని అని తనే చెప్పుకపోవాలి.. అన్నట్టుగా వ్యవహరిస్తుంటారాయన. ఇలా చేస్తే ఎవరైనా నవ్వుతారేమో అనేమొహమాటాలేమీ లేవు తెలుగుదేశం అధినేతకు.
ఇలాంటి నేపథ్యంలో బాబు కొట్టుకొనే డబ్బా పట్ల రాజకీయ ప్రత్యర్థులు కూడా గట్టిగానే స్పందించడం విడ్డూరమేమీ కాదు. ఉదాహరణకు ‘తెలంగాణలో సంపదను సృష్టించింది నేనే..” అంటూ బాబు చెప్పుకోగానే తెరాస లో ఉన్న తలసాని గట్టిగా స్పందించాడు!
‘చంద్రబాబూ ఒకసారి అద్దంలో నీ మొహం చూసుకో..’ అంటూ ఒకే మాటతో గట్టిగా సమాధానం చెప్పాడు తలసాని శ్రీనివాసయాదవ్. ఈ మంత్రిగారి మాటలు తీవ్రంగానే ఉన్నాయి కానీ.. బాబుకు మాటలకు మాత్రం సమాధానంగానే ఉన్నాయి. బాబు తన గురించి అంతలా డబ్బా కొట్టుకొంటుంటే.. దాన్ని సహించలేకే ఇలా మాట్లాడుతున్నామంటున్నారు తెరాస వాళ్లు. మరి తెరాస వాళ్ల నుంచి బాబుకు గట్టిగానే సమాధానం వస్తోందికానీ.. ఏపీలోని వైకాపా నుంచి మాత్రం బాబు విషయంలో అంత గట్టి సమాధానం రావడం లేదు!
మహానాడు ఆద్యంతం ఆత్మస్తుతి పరనిందలానే సాగింది.. ఆ విషయం సామాన్యుడికి కూడా అర్థం అయ్యింది. అయితే వైకాపా తరపు నుంచి మాత్రం ఈ పాయింట్ హైలెట్ కాలేదు. తెలుగుదేశం వారి సొంత డబ్బా సౌండ్ కు వైకాపా రిటర్న్ ఇవ్వలేదు. స్వయంగా లోకేష్ బాబు వైఎస్ ను, జగన్ ను విమర్శించాడు. ఈ విమర్శలకు కూడా వైకాపా నుంచి సరైన సమాధానం లేదు. మహానాడు డైలాగులకు ప్రతిగా వైకాపా తరపు నుంచి ఘాటైన డైలాగులు లేవు. మరి ఈ లోటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందో లేదో!