బుర్రిపాలెంలో మహేష్ బాబు పర్యటన సమయంలో తెలుగుదేశం పార్టీ ఉత్సాహం చూపించిన సంగతి తెలిసిందే. మహేష్ బావ, తెలుగుదేశం పార్టీ ఎంపి గల్లా జయదేవ్ మహేష్ పర్యటనను దగ్గరుండి చూసుకున్నారు. ఇక తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి కూడా మహేష్ వెంటే ఉండి అన్ని పనులను సక్రమంగా జరిగే విధంగా చూశారు.
ఈ పర్యటనకు రాజకీయానికి సంబంధం లేదని మహేష్ ముందునుంచి చెప్తున్నా.. తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఉత్సాహం చూపడం వెనుక మహేష్ బాబు తెలుగుదేశం పార్టీకి దగ్గరవ్వబోతున్నారు అని తెలుస్తున్నది.ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి జనసేన అధ్యక్షుడు దూరంగా ఉంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ కేంద్రంతో మెతక వైఖరి అవలంభిస్తున్నదని చెప్పి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా, ఇతర పార్టీలోని సభ్యులను తమ పార్టీలోకి ఆహ్వానించడాన్నికూడా పవన్ తప్పుపట్టారు.
పైగా వచ్చే ఎన్నికలలో సొంతంగా పోటీ చేస్తున్నట్టు పవన్ ఇప్పటికే ప్రకటించారు. పవన్ ప్రచారం చేయడంతో గతంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది.అయితే, వచ్చే ఎన్నికలలో పవన్ లేకుండానే పార్టీని ఎలా గెలిపించుకోవాలా అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ పడిపోయింది. అందుకు అనుగుణంగానే పవన్ తరువాత అంతటి చరిష్మా ఉన్న నటుడు మహేష్ బాబు కనిపించారు. ఇక గల్లా జయదేవ్ కు మహేష్ కు ఉన్న సంబంధంతో మహేష్ బాబును తమవైపు తిప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తున్నది. ఈ ప్రయత్నాలన్ని కూడా పవన్ కు చెక్ పెట్టేందుకే అని కొంతమంది వాదన.