తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. ఎంపీ .. అనే రెండు హోదాల్లో ఉన్న కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఒకే లక్ష్యాన్ని పెట్టుకొంది.
ఇప్పటికే తెలంగాణలో ఒక ప్రముఖ నేతగా.. సూపర్ పవర్ గా చెలామణి అవుతన్న కవితక్క ఇప్పుడు మరో పెద్ద టార్గెట్ ను పెట్టుకుంది. అయితే ఈ టార్గెట్ తో ఆమె తండ్రి కేసీఆర్ కే ఎసరు పెట్టాలని చూస్తుండటం విశేషం. అదెలాగంటే.. ఉన్న ఫలంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షురాలు అయిపోవాలనేది కవిత లక్ష్యం! ప్రస్తుతం ఆ స్థానంలో తన తండ్రి కేసీఆర్ ఉన్నా.. కవిత మాత్రం ఆ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.
తను దిగిపోయి అయినా సరే… తండ్రి తనకు ఆ పీఠాన్ని అప్పగించాలనేది కవిత వాంఛ. ఈ విషయంలో నో కాంప్రమైజ్ అని.. తనకు పార్టీ పగ్గాలు అప్పగించాల్సిందే అని కవిత పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ పదవి ప్రస్తుతం తండ్రి చేతిలో ఉంది.. అలాగే మరికొంతమంది కూడా ఈ పదవిని కోరుకుంటున్నారు. అలాంటి వారిలో ముఖ్యులు కేసీఆర్ ఇంట్లోనే ఉన్నారు. కేటీఆర్ , హరీష్ రావు లక్ష్యంలో కూడా పార్టీ అధ్యక్ష పదవి ఉందని వేరే చెప్పనక్కర్లేదు!
ఈ విధంగా అన్నా, మేనమామలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది కల్వకుంట్ల కవిత. ఈ విషయంలో తన కోరికను కూడా ఇప్పటికే తండ్రికి విన్నవించుకున్నట్టుగా సమాచారం. కవిత ప్రయత్నాలు అయితే తీవ్ర స్థాయిలోనే ఉన్నాయి. మరి అవి ఎప్పటికి నెరవేరతాయో.. అసలు నెరవేరతాయో లేదో కూడా ప్రస్తుతానికి అయితే చెప్పలేం!