బస్సుయాత్ర.. తెలుగు వారు బాగా ఎరిగిన వారిలో ఈ ఫీటును ఎక్కువగా చేసిన వారెవరయ్యా.. అంటే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.
మొన్నటి ఎన్నికలకు ముందు పది సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో తెలుగుదేశం అధినేత అనేక మార్లు బస్సు యాత్రలను నిర్వహించాడు! ఒకసారి అని కాదు..అప్పట్లో మాటెత్తితే తెలుగుదేశం అధినేత బస్సుయాత్ర అనే వారు. ఆంధ్ర, తెలంగాణ..ఇలా ఏ ప్రాంతం విషయంలోనైనా తెలుగుదేశం అధినేత బస్సు యాత్రనే ఎంచుకొనే వాడు!
పొలోమని తన ఎమ్మెల్యేలందరినీ బస్సులు ఎక్కించుకొని వెళ్లపోయేవారు. మరి అప్పుడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చేసిందే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా చేస్తున్నాడేమో అనిపిస్తోంది. అప్పుడు బస్సు యాత్రలతో తమ పార్టీ బలోపేతం అవుతుందని బాబు భావించినట్టుగానే..జగన్ కూడా బస్సు యాత్రలతో తన పార్టీని అధికారంలోకి తీసుకురావొచ్చని భావిస్తున్నట్టుగా ఉన్నాడు.
మరి భిన్న ధ్రువల్లాంటి వారైన బాబు, జగన్ లలో ఈ బస్సు యాత్ర రూపంలోని కామనాలిటి కనిపించడానికి మాత్రం కారణం ఒక వ్యక్తి అని తెలుస్తోంది. ఆయనే మైసూరారెడ్డి. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులూ స్ట్రాటజిస్టుగా బాబు వెంట ఉన్న మైసూరా రెడ్డి చాలా కాలం కిందట జగన్ వద్దకు వచ్చి చేరాడు. ఇప్పుడు ప్రాజెక్టుల వద్దకు బస్సులు వేసుకొని వెళ్లడమనే ఐడియా కూడా మైసూరాదే అని తెలుస్తోంది!
బాబు కు ఇచ్చిన సూచనలు.. సలహాలనే మైసూరా జగన్ కు కూడా ఇస్తున్నట్టుగా ఉన్నాడు. అయితే ఇలాంటి యాత్రలతో ఉపయోగం ఏమిటి? అనేదే సందేహం! ఖాళీ గా ఉన్న ఎమ్మెల్యేలందరినీ బస్సులు ఎక్కించి ప్రాజెక్టుల వద్దకు తీసుకెళ్లడం వల్ల సామాన్యుడికి ఉపయోగం ఏమిటి? ప్రతిపక్ష నేతగా జగన్ సాధించుకొన్నదలిచినది ఏమిటి? అనేవి సందేహాలు!
వెళ్లామమ్మా.. వచ్చామమ్మా.. అన్నట్టుగా మారింది వైకాపా ఎమ్మెల్యేల బస్సు యాత్ర. మామూలుగా వైకాపా ఆఫీసులో కూర్చొని చేసే విమర్శలనే.. ప్రాజెక్టుల వద్దకు వెళ్లి చేశారంతే. మరి హుస్సేనప్ప తాడిమర్రికి పోయిచ్చినట్టుగా.. ఇలా వెళ్లిరావడం వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. ఇలా గాకుండా.. వైకాపా అధినేత తన బస్సులో కొంతమంది నిపుణులకు చోటిచ్చి ఉంటే? ఏ ప్రాజెక్టువల్ల ఎవరికి ఎంత ప్రయోజనం కలుగుతుంది? అనే విషయాల గురించి విపులంగా వివరించగల నీటిపారుదల శాఖలో పనిచేసిన మాజీ ఇంజనీర్లతోనో వెళ్లి ఉంటే? వారి చేత ప్రజలకు పరిస్థితిని వివరింపజేసే ప్రయత్నం చేసి ఉంటే…? ఎలా ఉండేది!
జగన్ ఎన్ని రకాలుగా పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించినా… పాలక పక్షంగాపై ఎంతగా విరుచుకుపడినా.. అవి రాజకీయమైన విమర్శలే అనిపిస్తాయి. మరోవైపు జగన్ మాట్లాడే మాటలను ఆధారంగా చేసుకొని తెలుగుదేశం వారు ఆయనను రాయలసీమ ద్రోహి అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి రాజకీయ బాటలో కాకుండా.. శాస్త్రీయమైన దారిలో వెళ్లి ఉంటే… బస్సు యాత్ర సూపర్ హిట్ అని ఎవరైనా అనడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు మాత్రం ఆ విషయాన్ని వైకాపా వాళ్లు మాత్రమే ప్రకటించుకోవాల్సి వస్తోంది!