వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనవసరమైన వ్యవహారంలోకి తలదూరుస్తోందా? దీని వల్ల అనవసరమైన విమర్శలను ఎదుర్కొంటుందా? విమర్శలు వస్తాయనే భయం కూడా లేకుండా వ్యవహరిస్తోందా?
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ పార్టీ స్ట్రాటజీ కరెక్టేనా? అనే సందేహాలు కలుగుతున్నాయిప్పుడు.
తెలంగాణ శాసనసభ కోటాలో శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ప్రకటించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతానికి వైకాపా తరపున ఉన్న ఏకైక ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయనున్నాడు. ఈ విషయాన్ని వైకాపా అధికారికంగానే ప్రకటించింది. మరి ఇది కరెక్ట్ స్ట్రాటజీనేనా? అనే సందేహం ఉందిక్కడ. ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యే టీఆర్ఎస్ కు అండగా నిలబడటంపై తెలుగుదేశం పార్టీ విమర్శలు చేసే అవకాశం ఉంది.
ఏపీకి వెళ్లి.. ఈ విషయంలో గట్టిగానే ప్రచారం చేస్తుంది. జగన్ పార్టీ ఎమ్మెల్యే కేసీఆర్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించాడు.. కేసీఆర్, జగన్ లమధ్య ఒప్పందం ఉంది.. వాళ్లిద్దరూ లాలూచీ పడ్డారు.. అంటూ తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తుతుంది. ఈ విధంగా వైకాపా పై ప్రచారం చేసి.. ఏపీ ప్రజల్లో కేసీఆర్ పై ఉండే వ్యతిరేకతను జగన్ పైకి మళ్లించడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నించవచ్చు. మరి దాన్ని జగన్ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది? అనేది ఆసక్తికరమైన అంశమే. అయితే వైకాపా మాత్రం తెలుగుదేశం పార్టీ ని లెక్కచేయకపోవచ్చు. తెలంగాణ వాద అనుకూల బీజేపీ తో తెలుగుదేశం పార్టీ స్నేహం చేస్తున్న నేపథ్యంలో.. తాము తెరాసకు మద్దతు ప్రకటించడంలో తప్పేముంది? అని వైకాప వాళ్లు ఎదురు ప్రశ్నించవచ్చు!