ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోనికి వచ్చినా.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీని నామరూపాళ్లేకుండా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకనేది మాట్లాడుకునే ముందు.. పక్కనే ఉన్న తెలంగాణ గురించి ఓ రెండు ముక్కలు ఇక్కడ గుర్తు చేసుకుందాం. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ జీవితకల సాకారమై అధికార పీఠంపై కాలు మోపగానే చేసిన మొదటి పని.. తెలంగాణలో బలంగా ఉన్న ఇతర పార్టీలను నామరూపాళ్లేకుండా చేయడమే. మొదట వైకాపాపై దృష్టి పెట్టారు. తెలంగాణలో వైకాపాను క్లీన్ చేసేశారు. తర్వాత తెలుగుదేశంపై ఫోకస్ చేసి.. క్షేత్రస్థాయిలో బలంగా ఉండే తెలుగుదేశం పార్టీని రెండేళ్లలో తుడిచి పెట్టేశారు. మూడేళ్ల పాలనలో ఆంధ్రా పార్టీలంటూ ఈ రెండింటినీ పూర్తిగా లేకుండా చేశారు. తర్వాత కాంగ్రెస్‌పై ఫోకస్ చేసే సమయానికి.. ఐదేళ్ల పాలనలో మరో ఏడాదిన్నరే మిగిలి ఉండడంతో ఎన్నికలపై దృష్టి పెట్టాల్సి వచ్చి వదిలేశారు. దానికితోడు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పార్టీగా అక్కడి ప్రజల్లో సానుభుతి అధికంగా ఉంది. దీంతో కేసీఆర్‌కు కాంగ్రెస్‌ను తుడిచిపెట్టడం సాధ్యం కాలేదు. ప్రస్తుతం తెలంగాణలో తెరాస, కాంగ్రెస్ మధ్యే పోటీ. కానీ.. ఈసారీ కేసీఆరే గెలుస్తాడని, అయితే కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తుందనే టాక్ నడుస్తోంది. కేసీఆర్ గద్దెనెక్కే సమయానికి కనీసం బూత్‌స్థాయి ఏజెంట్లు కూడా తెరాసకు బలంగా లేరు. అందుకే.. తెలుగుదేశం, వైకాపాల్లోని వారికి ఎరేసి.. తమవైపు తిప్పుకున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికున్నప్పుడు తెరాస పార్టీని తుడిచేసేందుకు చివరికి కేసీఆర్ మేనళ్లుడు హరీష్‌రావుతో సహా అందరికీ గాలం వేశాడు. అది బాగా మనసుకు పట్టేయడంతోనే ఎదుటి పార్టీలో బలమైన నాయకుడంటూ లేకుండా చేసేంత పంతంతో కేసీఆర్ ముందుకెళ్లి అనుకున్నది చాలావరకూ సాధించారు.
ఇప్పుడు ఆంధ్ర గురించి మాట్లాడుకుందాం. చంద్రబాబు అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి కేసీఆర్‌తో పోల్చుకుంటే ప్రతిపక్షంపై చేసిన దాడులు పెద్దగా లేవు. ప్రతిపక్షాన్ని లేకుండా చేసేందుకు ఎత్తుగడలు, వేధింపులు, ప్రతిపక్ష నేతలను బ్లాక్‌మెయిల్ చేయడం, తాయిళాలు ఎరేయడం వంటివి పెద్దగా చేసింది లేదు. వారంతట వారు.. సొంత లబ్ధికోసం వచ్చిన వారిని మాత్రం వద్దనలేదంతే. జగన్‌తో సహా.. ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నాని, నెల్లూరు అనిల్‌కుమార్‌యాదవ్ లాంటి వాళ్లు చంద్రబాబును అత్యంత దారుణంగా తిట్టినా.. ఆయన మాత్రం వారిపై ఫోకస్ చేయలేదు. ఎంతసేపూ.. అభివృద్ధి, నిధులు, అమరావతి నిర్మాణం.. అంటూ వాటి వెంటే పడ్డాడు. కానీ.. మూడేళ్ల పాలన పూర్తయిన తర్వాత.. పవన్ కళ్యాణ్ ఎదురుతిరగడం, బీజేపీ తనను టార్గెట్ చేయడం వంటివి చూశాక.. చంద్రబాబు సైతం కొంచెం కఠినంగానే వీరి విషయంలో వ్యవహరించాలని అనుకునే సరికే.. సమయం మించిపోయింది. వీరిపై ఫోకస్ కంటే.. ఎన్నికలకు సన్నద్ధం చేసుకోవడంపై చంద్రబాబు, ఆయన పార్టీ శ్రేణులు ప్రస్తుతం దృష్టి పెట్టారు. కానీ.. మరోసారి మళ్లీ చంద్రబాబు 2019 ఎన్నికల్లో గెలిస్తే మాత్రం.. పూర్తిగా ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఫోకస్ పెట్టనున్నట్టు ఆయన పార్టీకి చెందిన నేతలు సైతం చెప్పుకుంటున్నారిప్పుడు. 2019 ఎన్నికల్లో జగన్ గెలిస్తే మాత్రం ఇంక చెప్పడానికి ఏం లేదు.. మాటల్లేవ్.. అన్నీ చేతలే ఉంటాయని ఆయన గురించి దగ్గరిగా తెలిసిన వారు ఇప్పటికే అనేక సందర్భాలలో బాహాటంగానే ప్రకటించారు. ఆయనకు అనుయాయులుగా ఉంటూ.. వైకాపాలో కీలకంగా మారి జగన్‌తో సహా ప్రకటనలు చేసే కొడాలి నాని, వంగవీటి రాధ, విజయసాయిరెడ్డి, రోజా, అంబటి రాంబాబు, అనిల్‌కుమార్ యాదవ్.. వీరి మాటలు వింటే చాలు.. అధికారంలోనికి వస్తే ఎంత కసితో ప్రతిపక్షాన్ని తొక్కేస్తారనేది తేలికగానే అర్థమైపోతోంది. వీరు ఉపయోగించే భాష చూసినా.. సామాన్యులకూ వెన్నులో వణుకు పుడుతంది. గుడ్డలూడదీసి కొట్టాలి, బొక్కలో పెట్టాలి, అసెంబ్లీలో ఫుట్‌బాల్ ఆడుకుంటాం, మా ప్రతాపం చూపుతాం.. ఇలాంటి ప్రకటనలు కొన్ని వందలు.. వేలసార్లు చేశారు. పైగా.. ఆకలిగొన్న పులిలా.. వైఎస్ మరణం తర్వాత సంతకాలతో సీఎం అవుదామని చూస్తే.. సోనియాగాంధీ జగన్‌ను తొక్కేసింది, తర్వాత.. ఎన్నికల్లో గెలుద్దామంటే చంద్రబాబుకు ప్రజలు పట్టం కట్టారు. ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరాలన్నంత పంతంతో జగన్ ఉన్నారు. అందుకే.. గత నాలుగేళ్ల నుంచి వచ్చేది మన ప్రభుత్వమే, నేనే సీఎం అంటూ వందలసార్లు జగన్ ప్రకటించారు. ఎవరు ఏది అడిగినా.. మన ప్రభుత్వం వచ్చాక చేసుకుందామంటూ.. చెప్పడం చూస్తేనే అధికారం కోసం ఎంత పంతంతో ఉన్నారో అర్థమవుతోంది. ఒకసారి గద్దెనెక్కితే.. ఇంక దిగే ప్రశక్తే లేదని ఇప్పటికే అనేకసార్లు ప్రకటించారు కూడా.. అంటే ప్రతి పక్షం లేకుండా చేస్తే ఇది పెద్ద కష్టం కాదు.
పవన్ కళ్యాణ్‌నూ వదలరు..
చంద్రబాబు, జగన్ ఇద్దరిలో ఎవరు గద్దె నెక్కినా.. పవన్ కళ్యాణ్ పరిస్థితి దారుణంగా మారనుంది. చంద్రబాబు రాజకీయం ఎలా ఉంటుందనేది పవన్‌కు బాగా అర్థమవుతుంది. జగన్ పట్టుబడితే పవన్ మళ్లీ తెలంగాణలో రాజకీయం మాటెత్తకుండా.. కేసీఆర్ ఎలా బంతాట ఆడుతున్నారో.. అంతకు పది రెట్లు ఆడగల సామర్థ్యం చంద్రబాబుకు ఉంది. కానీ.. పవన్‌ను మిత్రుడిగా అనుకుని వదిలేశాడు. జగన్ గద్దెనెక్కినా పవన్‌కు ముప్పు తప్పదు. జనసేనతో తనకు భవిష్యత్తులో పోటీ ఉంటుందని ఇప్పటికే వైకాపా అధినేత భావిస్తున్నారు. అందుకే ఎన్నికల తర్వాత జనసేన పార్టీపై ఫోకస్ చేయడం తథ్యం. అయితే.. జనసేనకు సంబంధించినంత వరకూ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ప్రభావం చూపించే నాయకులు ఒక్కరు కూడా ఇంతవరకూ లేరు. అందరూ మెగా అభిమానులు, చిన్నా చితకా నేతలు తప్ప.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయి ఉన్నవాళ్లు లేరు. ఎన్నికల తర్వాత పవన్ చూపించే ప్రభావం ఆధారంగానూ.. జనసేనపై మిగతా రెండు పార్టీల అధినేతలు దృష్టి పెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే.. అధికారం కోసం అవసరమైన మేజిక్ ఫిగర్ కోసం పవన్ మద్దతు తీసుకుంటే.. మాత్రం జనసేనకు పెద్దగా ముప్పుండదు. ఒకవేళ పవనే సీఎం అయితే.. మాత్రం మిగతా రెండు పార్టీలు సేఫ్. వాటి జోలికి వెళ్లి, నేతలను వేధించి, తన పార్టీలో చేర్చుకునేంతగా పవన్ ఎప్పటికీ దిగజారలేడనేది ఇప్పటికున్న టాక్.