చంద్రబాబు, నారాలోకేస్‌పై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే విమర్శలు గుప్పించారు. డీఎస్పీ దుర్గాప్రసాద్ నుంచి చట్టబద్దంగానే తాను ఆస్తులను కొనుగోలు చేశానని చెప్పారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయీలనుంచి తప్పు కుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ల లూటీలను న్యాయస్థానాలలో నిరూపించానని అందుకే నాపై కక్ష గట్టారన్నారు. నారా లోకేష్ పనికిమాలిన దద్దమ్మ అని మండిపడ్డారు. రాజావాసిరెడ్డి ఇచ్చిన భూములను కొట్టేయాలని లోకేష్ ప్రయత్నాలు చేస్తే అడ్డుకున్నానని, దానితో పాటు ఓటుకు నోట్లు కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు ఇప్పించినందుకే తనను వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు.
కేవలం తాను సాక్షిగా మాత్రమే విచారణకు హాజరయ్యాను అని తెలిపారు. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి నుంచి తాను భూములు కొన్నది వాస్తవమేనని తెలిపారు. తాను చట్టబద్ధంగానే భూములు కొనుగోలు చేశానని తెలియజేశారు. సంవత్సరన్నర నుంచి నడుస్తున్న ఈ కేసులో తాను అక్రమంగా కొనుగోలు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ఆర్కే దగ్గర కీలక సమాచారం రాబట్టారని టీడీపీ వారు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేయడం మొదలు పెట్టారని, అందులో వాస్తవం లేదని అన్నారు.
డిఎస్పీ దుర్గా ప్రసాద్ బినామీ ఆస్తుల కేసులో వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం ఎసిబి ఎదుట విచారణకు హాజరయ్యారు. గతంలో రెండుసార్లు అనారోగ్యం కారణంగా విచారణకు గైర్హాజరైన అతను ఇప్పుడు ఎసిబి ముందుకు వచ్చారు.