Sunday, May 4, 2025
- Advertisement -

వాళ్ల‌కు అన్నం దూరం చేసి.. మీ ఇళ్ల‌లో పెడ‌తారా

- Advertisement -

ప్ర‌స్తుతం అవ‌కాశం ఉన్న ఏ విష‌యంలోనైనా రాజ‌కీయం చేసి ప‌బ్బం గ‌డుపుకునే రాజ‌కీయం ఆరంభ‌మైపోయింది. అస‌లే ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌లు కూడా స‌మ‌యం లేక‌పోవ‌డంతో.. రాజ‌కీయ నిరుద్యోగులంతా రోడ్డెక్కేశారు. ఏం క‌నిపిస్తే.. దానిపై విషం చిమ్ముతున్నారు. ప‌నిలో ప‌నిగా ఇప్పుడు పేదోడి కూడు పైనా వారి రాజ‌కీయం మొద‌లెట్టారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ఇటీవ‌ల ఐదు రూపాయ‌ల‌కు అన్నం పెట్టే బ్ర‌హ్మాండ‌మైన ప‌నిని ఆరంభించింది. అన్న క్యాంటీన్లను మొద‌టి ద‌శ‌లో భాగంగా.. జులై 11న‌.. రాష్ర్టంలో 60 చోట్ల తెరిచారు. అనంత‌రం అంచెలంచెలుగా 203 కేంటీన్ల‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ప్ర‌తి కేంద్రంలోనూ ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నాల‌ను కేవ‌లం ఐదు రూపాయ‌ల‌కే అందిస్తున్నారు. రోజుకు ఈ కేంటీన్ల‌న్నింటి ద్వారా క‌నీసం రెండున్న‌ర ల‌క్ష‌ల మందికి భోజ‌నం అందించాల‌నేది ప్ర‌ణాళిక‌. అయితే.. ఇప్ప‌టికి ప‌ది రోజులైంది. అన్నిచోట్లా ఆహారం బాగానే ఉంటోంది. కానీ.. అక్క‌డ‌క్క‌డా కొన్నిచోట్ల భోజ‌నాలకు వ‌చ్చేవాళ్ల సంఖ్య ఎక్కువ ఉంటోంది. దీంతో చాల‌డం లేదు. కొంద‌రికి అంద‌డం లేదు. కానీ.. క‌నీసం నెల రోజులైనా ఎలా ఉందో చూశాక‌.. అప్పుడు దానిపై ప్ర‌తిప‌క్షాలు, రాజ‌కీయ నిరుద్యోగులు ఫైర్ అయితే బాగుంటుంది.
కానీ.. ప్రారంభించిన రోజు నుంచి.. అన్న క్యాంటీన్లు అవినీతి మ‌య‌మంటూ ధ్వ‌జ‌మెత్తుతూ.. కోట్ల‌లో తినేస్తున్నారంటూ.. ఎవ‌డెవ‌డో యూట్యూబ్‌ల‌లో వీడియోల‌ను పెడుతున్నారు. అస‌లేంటీ గోలంతా. క‌నీసం ఓ ఆరు నెల‌లు ఆగి.. త‌ర్వాత లోపాల‌ను ఎత్తిచూపితే ఒక అర్థ‌ముంటుంది. కానీ.. ఇంకా పేదోడి పొట్ట‌లోనికి అన్నం వెళ్ల‌డం ఆరంభ‌మై ప‌దిరోజులు కాక‌ముందే.. ఏంటింత‌గా విరుచుకుప‌డ‌డం. అంటే ఏంటీ వీళ్ల ఉద్దేశం.. అర్జంటుగా ప్ర‌భుత్వం అన్న క్యాంటీన్ల‌ను ఎత్తేసి.. పేదోడికి అన్నం లేకుండా చేయాలా. అరె.. ఎంత‌మందికి అంద‌డం లేద‌ని ప‌క్క‌న‌పెట్టి.. అస‌లు ఎంత‌మందికి అందుతోంద‌నేది చూడొచ్చు క‌దా. ఇప్పుడు ఇలా వివాదాలు చేసీ చేసీ.. చివ‌రికి ఆపేసే వ‌ర‌కూ వెళ్తే.. ఇప్పుడు హాయిగా ఐదు రూపాయ‌ల‌కు అన్నం తింటున్న పేదోడికి మీరేమైనా ఒక్క‌పూట అన్నం పెడ‌తారా. ఇప్పుడు మాట్లాడుతున్న వాడు.. ఒక్క‌డైనా.. ఒక పూట అన్నం పెట్ట‌గ‌ల‌డా. వాళ్లంతా పొట్ట‌లు చేత ప‌ట్టుకుని రోడ్డున ప‌డితే.. విమ‌ర్శించేవాడు ఇంకో టాపిక్‌ను ఎంచుకుని.. ఏసీ రూముల్లో హాయిగా ముక్క భోజ‌నాలు చేస్తూ.. ఎంజాయ్ చేస్తుంటాడు.
మంగ‌ళ‌గిరి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి మాదిరిగా.. ద‌మ్ముంటే ఓ కేంటీన్‌ను సొంత డ‌బ్బుల‌తో ఏర్పాటు చేసి రోజుకు క‌నీసం ఓ ప‌ది మందికి భోజ‌నం పెడితే.. అప్పుడు విమ‌ర్శిస్తే.. ఆరోగ్య‌క‌రంగా ఉంటుంది. నాలుగు రూపాయ‌ల‌కే ప్లేట్ భోజ‌నం అందించేలా రాజ‌న్న కేంటీన్‌ను ఈ ఎమ్మెల్యే మంగ‌ళ‌గిరి ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేశాడు. నిత్యం వంద‌ల మంది ఇక్క‌డ తింటున్నారు. ఇప్పుడు ఇలాగే రాష్ట్ర‌ మంతా ప్ర‌భుత్వ‌మే ఏర్పాటు చేసి ఆహారం అందిస్తుంటే.. క‌డుపు మంట ఎందుకు. ఆక‌లి చావులు చచ్చినా.. మీకు ప‌ర్వాలేదు కానీ.. రాజ‌కీయం విష‌యంలో రాజీప‌డేది లేదంటూ.. పేదోడి పొట్ట‌కు క‌న్నం పెట్టే ప‌నుల‌ను ఆప‌డం లేదు. అన్నం దొర‌క‌ని వాడి ఆవేద‌న‌, వాడి కోపాన్ని వీడియోలుగా మార్చి తెగ ప్ర‌చారం చేస్తున్న‌.. ఈ కుహ‌నా రాజ‌కీయ నాయ‌కులు తిన్న‌వాడి మాట‌ల‌ను సైతం అడిగి వీడియోలుగా పెడితే బాగుంటుంది. రాష్ట్ర‌ప్ర‌భుత్వం అక్ష‌య పాత్ర ఫౌండేష‌న్ సంయుక్తంగా అన్న కేంటీన్ల‌ను న‌డుపుతున్నాయి. వివాదాలు మ‌రీ ఎక్కువైతే.. త‌మ‌కెందుకు గొడ‌వ అని అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ త‌ప్పుకుంటే.. పేదోడికి అన్నం పెట్టేదెవ‌రో.. ముందు చెప్పి.. ఆ త‌ర్వాత ఎన్ని కోట్ల‌ను ఎవ‌రు తిన్నార‌నేది విమ‌ర్శిస్తే బాగుంటుంది. ఆ తినేవాడు డ‌బ్బుల‌ను ఇక్క‌డే తింటాడ‌ని గ్యారెంటీ ఏముంది.. ఇక్క‌డ కాక‌పోతే మ‌రో ద‌గ్గ‌ర తింటాడు. కానీ.. పేదోడికి క‌డుపు నిండ‌దు.. క‌దా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -