ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఆపరేషన్ వికర్శ్‌గా మారుతోంది. ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేయాలని బాబు చేపట్టిన ఫిరాయింపులు అడ్డుతిరుగుతున్నాయి. జంపింగ్ జిలానీలు రాజకీయాలు పుట్టినప్పటినుంచి ఉన్నాయని చెప్పొచ్చు. కాని టీడీపీ అధికారంలోకి వచ్చాక జంపింగ్‌లకు కేరాఫ్‌గా మారింది.
వలసల పేరుతో వైసీపీని నీరు గార్చడం ద్వారా రాబోయే 30 ఏళ్లు తానే అధికారంలో కొనసాగాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. లితంగా ఇప్పటికే 20 మంది జగన్ బై చెప్పి సైకిలెక్కారు. తాజాగా పార్టీ సీనియర్లను మంగళగిరికి పిలిచి మరీ వర్క్ షాపు పేరుతో రాబోయే రోజుల్లో జంపింగ్‌లు ఉంటాయి. కాబట్టి అందరూ సర్దుకు పోవాలంటూ క్లాస్ పీకారు. బాబుకు చెప్పలేక అందరూ తలలూపారు.
వైసీపీ నేతలను పార్టీలోకి చేర్చుకోవడంపై టీడీపీ కేడర్‌లో పూర్తి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త వారు వస్తే.. తమ పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు. ఇప్పటికే వచ్చిన వారితో నేతలకు ఎంతమాత్రమూ సరిపడడం లేదు. జమ్మలమడుగు, అద్దంకి, పలమనేరు, కందుకూరు ఇలా అన్ని చోట్లా వైసీపీ నుంచి వచ్చిన నేతలతో టీడీపీ నేతలకు పొసగడం లేదు. దీంతో విబేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి.
ఇప్పటికే ఉన్న కుంపటి చాలదన్నట్టు కొత్తగా నేతలను ఫిరాయింపులకు ప్రోత్సహించడం ఇప్పుడున్న పరిస్థితిలో అనవసరమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న వారితో ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో కొత్తవారిని ప్రోత్సహించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. బాబు ఊహించినట్టు నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం లేదని కేంద్రం తేల్చేసింది.
పార్టీలో ఇప్పుడున్న తగాదాలను తీర్చాలంటె బాబుకు తలనొప్పిగా మారింది. పార్టీలో ఉన్న సిట్టింగులకు సీట్లివ్వాలా? లేక కొత్తగా ఫిరాయించే వారికి సీటు కేటాయించాలా? ఇది కూడా అధినేతకు పెద్ద సమస్య. ఇప్పటికే పంచాయితీలు తీర్చలేక బాబు నానా తిప్పలు పడుతున్న నేపథ్యంలో కొత్త సమస్యలు ఎందుకని అంటున్నారు సీనియర్ నేతలు. చూడాలి బాబు మార్క్ రాజకీయం ఎలా ఉంటుందో.