ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీలోని కొందరు నాయకులు తమ దారి తాము చూసుకుంటున్నారు. పార్టీ తరుపున టికెట్ రాని వాల్లంతా ఒక్కోక్కరూ మెల్లగా జారుకుంటూ తమ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెడుతున్నారు. పార్టీలో ప్రాధన్యత ఇవ్వకపోవడం,గ్రూపుతగాదాలను ప్రోత్సహించడంలాంటి అడ్డగోలు రాజకీయాల వల్ల పార్టీని వీడుతున్నారు.
తాజాగా నెల్లూరు జిల్లా కొవ్వూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్న కన్నబాబు పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెంది ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. నియోజకవర్గ ఇన్ చార్జ్ గా ఆదాల ప్రభాకర్ రెడ్డిని మంత్రి సోమిరెడ్డి నియమించిన తరువాత వర్గపోరు తారాస్థాయికి చేరింది. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
తాజాగా పార్టీ కార్యాలయంలో కన్నబాబు, తన అనుచరులతో కలసి దీక్షకు దిగడంతో పరిస్థితి విషమించింది. ఇటీవలి పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రులు సోమిరెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, పీ నారాయణలు ఆత్మకూరు గురించి చర్చించిన తరువాత ఆదాల నియామకాన్ని ఖరారు చేయగా, పార్టీ నిర్ణయాన్ని కన్నబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటినుంచి గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరాయి.
నిన్న టీడీపీ కార్యాలయాన్ని తన అధీనంలోకి తీసుకున్న కన్నబాబు, నేడు రెండో రోజూ దీక్షను కొనసాగిస్తుండటంతో పోలీసులు బందోబస్తును పెంచారు. కన్నబాబు అనుచరులంతా పార్టీకి రాజీనామా చేద్దామని సలహాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ తనకు లభించదన్న సంకేతాలు అందిన తరువాతే కన్నబాబు తన నిరసనను ఇలా తెలియజేస్తున్నట్టు సమాచారం. దీంతో ఆత్మకూరు రాజకీయం మరింత వేడెక్కింది.