ప్రతి సార్వత్రిక ఎన్నికల్లోనూ దాదాపు 30 నుంచి 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సారీ అదే వ్యూహం అమలు చేస్తున్నారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటుందని బాబు తరచూ చెబుతుంటారు. పనితీరు మార్చుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తుంటారు కూడా. పని తీరు మార్చుకోని ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇస్తే వారితో పాటు పార్టీ కూడా మునిగిపోతుందన్నది చంద్రబాబు అనుభవంతో చెబుతున్న మాట. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని ప్రతి జిల్లాలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించనున్నారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం సిట్టింగ్ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులకు ఈ సారి టికెట్ దక్కే అవకాశాలు చాలా తక్కువని తెలుస్తోంది. ఆయన పనితీరుపై నియోజకవర్గంలో అసంతృప్తి పెరగడంతో పాటు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలతోనూ అంతంతమాత్రంగానే ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ సారి చిరంజీవులకు టికెట్ రాకపోవచ్చన్నది టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. చిరంజీవులు స్వగ్రామం కృష్ణపల్లిలో కూడా ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని, దశాబ్దాల నుంచీ అదే గ్రామానికి చెందిన వ్యక్తులే పార్వతీపురం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నా గ్రామాభివృద్ధికి కనీసం పాటు పడలేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవులు ఎమ్మెల్యేగా అయ్యాకైనా పరిస్థితిలో మార్పు వస్తుందేమో అని ఆశించిన ప్రజలకు తీవ్ర నిరాశే ఎదురైంది. గ్రామంలో కనీసం సీసీ రోడ్లు లేవు కదా కనీసం శ్మశానవాటికకు వెళ్లేందుకు కూడా సరైన రోడ్డు నిర్మించలేని అధ్వాన్నస్థితిలో ఎమ్మెల్యేగా చిరంజీవులు పని చేశారని స్థానికులు మండిపడుతున్నారు. వర్షాకాలంలో ఎవరైనా ఎమ్మెల్యే స్వగ్రామంలో తుదిశ్వాస విడిస్తే శ్మశానవాటికకు తీసుకెళ్లాలంటే నరకానికి వెళ్తున్నట్టే ఉంటుందని, మోకాళ్ల లోతు బురదలో, దారికిరువైపులా అత్యంత అపరిశుభ్రవాతావరణంలో నరకం కనిపిస్తుందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రహదారులే కాదు కాలవలు, తాగునీరు వసతులు, ఇతర అభివృద్ధి పనుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెబుతున్నారు. ఎమ్మెల్యే స్వగ్రామంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక నియోజకవర్గంలో ఎంత దారుణంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చని విమర్శలున్నాయి.
ఈ నేపథ్యంలో అటు జనంలో ఇటు జిల్లా టీడీపీ నేతల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న చిరంజీవులకు ఈ సారి టికెట్ కష్టమేనని తెలుస్తోంది. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యేగా మంచి పని తీరు కనబరిచి నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడ్డారని పేరు ఉన్న సవరపు జయమణి వైపు టీడీపీ నేతలు మొగ్గు చూపుతున్నారు. బొబ్బిలి రాజుల ఆశీస్సులతో పాటు జిల్లా టీడీపీ అగ్రనేత అశోక్ గజపతి రాజు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు చిన్నం నాయుడు, పార్వతీపురం ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగధీష్ సహా ఇతర జిల్లా నాయకులు జయమణి అభ్యర్ధిత్వం వైపు ఆసక్తి చూపుతున్నారని విశ్వసనీయ సమాచారం. 2009 నుంచి 2014 వరకూ ఎమ్మెల్యేగా ఆమె పని తీరు పార్వతీపురం నియోజకవర్గ ప్రజల మనన్నలు అందుకుంది. ఇప్పుడు కూడా కులబలం, అంగబలం, ధనబలం జనాభిమానం ఉన్న జయమణికి టికెట్ ఇప్పిస్తే పార్వతీపురం నియోజకవర్గంలో గెలుపును టీడీపీ ఖాతాలో వేసుకోవచ్చని జిల్ల నేతలు భావిస్తున్నారు. అదే అంశంపై పార్టీ అధినేత చంద్రబాబుకు, లోకేశ్ కు కూడా నేడో రేపో నివేదికలు కూడా అందజేయనున్నారని విశ్వసనీయ సమాచారం. అదే జరిగి పార్టీ అధ్యక్షుడి మెప్పు పొందితే రెండో సారి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని జయమణి బరిలో దిగడం ఖాయం. అందుకే ఆమె కూడా అటు మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుసహా జిల్లా టీడీపీ పెద్దలందరి ద్వారా గట్టిగానే పావులు కదుపుతున్నారు. మరి అదృష్టం ఎలా ఉందో చూడాల్సిందే.