కేంద్ర ప్రభుత్వం బడ్జెట్స్ ప్రవేశ పెట్టే సమయం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డ్రామాకు తెరలేస్తుంది. మూడున్నరేళ్ళుగా ప్రతిసారీ అదే డ్రామా చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకునే చంద్రబాబుగారు ఈ డ్రామాని మాత్రం అత్యంత అనుభవంతో అత్యద్భుతంగా నడిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబు కొన్ని మాటలు చెప్పారు. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయన్నారు, భారతదేశ అభివృద్ధికంటే ఆంద్రప్రదేశ్ అభివృద్ధినే చాలా ఎక్కువ ఎందన్నారు. దేశంలోనే అత్యంత ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు.
చంద్రబాబు ఈ మాటలు చెప్పిన రోజునే టిడిపి ఎంపిలందరూ మూడున్నరేళ్ళుగా ప్రజలకు చూపిస్తున్న ఒక డ్రామా స్టంట్‌ని మరోసారి చేసి చూపించారు. ఆ స్టంట్ అయిన వెంటనే……మేం కరివేపాకులం, చేతకాని వాళ్ళం, మోడీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. చంద్రబాబును అస్సలు లెక్క చేయడం లేదు, ఆంద్రప్రదేశ్ రాస్ట్రానికి అసలు ఏమీ చేయడం లేదు అని శోకాలు తీశారు.
ఇప్పుడు తాజాగా చంద్రబాబు కేంద్రానికి ఒక లేఖ రాశారు. అదీ కూడా అడిగీ అడగనట్టుగా, చెప్పీ చెప్పినట్టుగా చాలా లౌక్యంగా ఒక లేఖ రాశారు. ఆ లేఖ చదివాక పూర్తిగా అర్థమయ్యే సారాంశం ఒక్కటే. రాష్ట్రం పూర్తిగా కష్టాల్లో ఉంది. విభజన హామీలు ఏవీ నెరవేరడం లేదు. ప్యాకేజ్ కింద ఇస్తామన్న నిధులు కూడా రావడం లేదు అంటూ కడు బీద అరుపులు అరుస్తున్న చంద్రబాబు గోస కనిపిస్తుంది.
ఇక్కడే చంద్రబాబును అనుమానించాల్సి వస్తుంది. ఇదే ప్యాకేజ్ అద్భుతం అని చంద్రబాబు ఎందుకు ముందే మోడీకి సర్టిఫికెట్ ఇచ్చినట్టు? ప్రతిపక్ష నాయకుడు జగన్‌తో సహా చాలా మంది నాయకులు ప్యాకేజ్ వేస్ట్ అని ఆవేధన వ్యక్తం చేస్తే చంద్రబాబు మాత్రం వాళ్ళను ఎద్దేవా చేశాడు. నా అనుభవమంత వయసులేని వాళ్ళు నాకు చెప్పడమా అన్నాడు. ఏకంగా అసెంబ్లీలోనే ప్రత్యేక తీర్మానం ప్రవేశ పెట్టి మోడీకి, కేంద్రానికి ధన్యవాదాలు తెలియచేశాడు. మరి ఇప్పుడు ఈయనగారు రాసిన లేఖలో ఉన్న మాటలే నిజాలైతే కేంద్రానికి ముందుగానే ఎందుకు ధన్యవాదాలు తెలియచేసినట్టు?
అయినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, అధికారం చేతిలో లేనివాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళకు లేఖలు రాయడంలో ఒక అర్థం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న చంద్రబాబు……కేంద్రంలో కూడా అధికారం పంచుకుంటూ కేంద్ర కేబినెట్ మంత్రి పదవులు అనుభవిస్తున్న చంద్రబాబు పార్టీ జనాలు లేఖలు రాయడంలో అర్థం ఏముంది? ఎవరిని మోసం చేయడానికి ఈ డ్రామాలు?
ఒకవైపు ఆంధప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుందని బాబే చెప్తాడు………మరొవైపు రాష్ట్రం అష్టకష్టాల్లో ఉందని కూడా ఆయనే చెప్తాడు. అలాగే కేంద్రం అద్భుతంగా సాయం చేస్తోందని, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ చేస్తోందని కూడా చంద్రబాబే చెప్తాడు. వైఎస్ రాజశేఖరరెడ్డికంటే నేనే ఎక్కువగా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నానని చెప్తూ ఉంటాడు. మరోవైపు కేంద్రం అస్సలు ఏమీ ఇవ్వడం లేదని కూడా ఆయనే ఆర్తనాదాలు వినిపిస్తాడు.
భారతదేశంలో ఉన్న నాయకులందరిలోకి కూడా ప్రజల ఆలోచన స్థాయిన అత్యంత చులకనగా చూసే నేత చంద్రబాబు ఒక్కడే. అందుకే ఈ స్థాయి డ్రామాలు ఆడుతూ ఉంటాడు. చంద్రబాబు అండ్ కో డ్రామాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలంటే మాత్రం 2019వరకూ ఆగాల్సిందే.
లాస్ట్ పంచ్ః కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిన వెంటనే జగన్ కంటే ముందుగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి అన్యాయం చేసింది అని చంద్రబాబే చెప్తాడు చూడండి. కాకపోతే అదే నోటితో పూర్తి న్యాయం చేసేలా నేను పోరాడతాను అని కూడా బాబు అంటాడు. ఆ వెంటనే పోరాటమా……..వంకాయా……అని టిడిపి ఎంపి జేసీ కూడా ఓ స్టేట్‌మెంట్ పడేస్తాడు చూడండి. వాటే డ్రామా సర్ జీ?