ఎన్నికల సమయంలో టీడీపీ వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వరుసుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఒక్కక్కరే పార్టీని వీడుతున్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నిసర్వేలు తేల్చి చెప్పడంతో తమ భవిష్యత్తుకోసం వైసీపీ వైపు చూస్తున్నారు.
త్వరలో జరిగే ఎన్నికల్లో టికెట్ హామీ, పార్టీల్లో ప్రాధాన్యత దక్కని నేతలు పక్క చూపులు చూస్తున్నారు. మొన్నే రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో చేరి టీడీపీకి షాక్ ఇవ్వగా.. తాజాగా మరో ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది.
ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి ప్యాన్ కిందకు చేరేందుకు రంగం సిద్ధం అయినట్లు సమాచారం. తన అనుచరులతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణతో పాటూ పార్టీ మారే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ మారే యోచనతోనే ఆయన రెండు రోజులుగా జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కొద్దిరోజులుగా ఆమంచి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని జిల్లాలో చర్చ నడిచింది. ఇక ఎన్నికలు కూడా ఎక్కువ దూరంలో లేకపోవడంతో….ముందు జాగ్రత్తగా వైసీపీలో చేరాలని ఇప్పటికే దాదాపుగా ఓ నిర్ణయం తీసుకున్నారని … ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే… సాయంత్రం లేదా బుధవారం వైఎస్ జగన్‌ను కలిసి ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరతారని జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. నియోజక వర్గంలో ఆమంచి, పోతుల సురేశ్‌కు మధ్య పడటంలేదు. బాబు ఎన్నిసార్లు రాజీ చేయాలని ప్రయత్నించినా సఫలం కావడంలేదు. టీడీపీలో తనను పట్టించుకోవడం లేదని ఆవేదనలో ఉన్న ఆయన పార్టీని వీడాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచితో జనసేన, వైసీపీ టచ్ లో ఉన్నారు.