ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ చీరాల ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా ఆమంచి టీడీపీని వీడుతున్నారనే ప్రచారం నేపథ్యంలో బాబు ఆమంచిని పిలిపించుకొని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. కాని బాబు బుజ్జగించిన ప్రయత్నాలు ఫలింలేదు. బాబు నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. బుధవారం టీడీపీకి రాజీనామా చేసిన ఆమంచి, తన లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు పంపారు. తమ అనుచరులతో చర్చించిన అనంతరం వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.
చీరాల నియోజకవర్గంలో కొన్ని శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తున్నానని, ప్రభుత్వం, పార్టీకి సంబంధం లేని శక్తులు అక్కడ పని చేస్తున్నాయని, అందుకే తాను టీడీపీకి రాజీనామ చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆమంచి తన లేఖలో పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ఇండిపెడెంట్‌గా గెలిచిన ఆమంచి తరువాత టీడీపీలో చేరారు. గత కొంత కాలంగా పార్టీలో తగిన ప్రాధాన్యత లేకపోవడంతోపాటు పార్టీ మారాలని నర్ణయం తీసుకున్నారు.
ప్రధానంగా చీరాల నియోజక వర్గంలో వర్గపోరు తారాస్థాయికి చేరడంతో ఆమంచి టీడీపీని వీడుతున్నట్టు ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమంచి, ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. చీరాలలో రెండు గ్రూపులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆమంచి తన కుటుంబ సభ్యులతో సహా బుధవారం ఉదయం హైదరాబాద్‌లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ… త్వరలో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు తెలిపారు.
