కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఇప్పుడు దేశంలో రెండు అంశాలపై వివాదం రేగుతోందని… కొందరు దేశాన్ని విభజించు, పాలించు అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నారని… ఇంకొందరు దేశ ప్రజలందరినీ ఏకం చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. నగరంలోని చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావనా యాత్రను ప్రారంభించిన అనంతరం రాహుల్ మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీనేతలు జాతి, మతం, ప్రాంతం, లింగ భేదాలు లేకుండా అందరినీ కలుపుకుని స్వాతంత్య్రం కోసం పోరాడగా.. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ప్రాంతం, మతం, భాష, కులం అంటూ విధ్వేషాలు రెచ్చగొడుతుందని రాహుల్ వ్యాఖ్యానించారు.
నోట్లరద్దును మించిన పిచ్చిపని మరొకటి లేదని ఆర్థిక నిపుణులు చెప్పారని గుర్తుచేశారు. తమ వారి వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకోవడానికి మోదీ నోట్లరద్దును వాడుకున్నారని విమర్శించారు. అదే నోట్ల రద్దుతో దేశ ప్రజల్ని ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో నిల్చోబెట్టారని మండిపడ్డారు.
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడే భారత ప్రధాని దొంగ అని చెప్పారు. మోదీ సలహా వల్లే అంబానీ కంపెనీకి కాంట్రాక్ట్ దక్కింది. హెచ్‌ఏఎల్ కంపెనీని తప్పించి అంబానీకి కాంట్రాక్ట్ కట్టబెట్టారు. హెచ్‌ఏఎల్ 70 ఏళ్లుగా యుద్ధ విమానాలు తయారు చేస్తోంది. రాఫెల్ ఒప్పందం వెనుక 30 వేల కోట్ల కుంభకోణం దాగి ఉందని సంచలన ఆరోపనలు చేశారు.