పవన్ కళ్యాణ్ పార్టీ కూడా పాత రాజకీయ పార్టీలకు ఏమాత్రం తీసిపోలేదని తేలిపోయింది. జనసేనకు విరాళాలు ఇవ్వండి అంటూ ఆయన పార్టీ సోషల్ మీడియా వింగ్ కొన్ని పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే గతంలో పలువురు నుంచి జనసేన కూడా విరాళాలు సేకరించింది. అయితే ఎవరైనా స్వచ్ఛంధంగా ఇస్తేనే తీసుకుంటున్నాం తప్ప, బలవంతం చేయడం లేదు. ఎవరినీ ప్రత్యేకించి అడగడం లేదు. అని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పుకొచ్చారు.
అయితే తన దగ్గర డబ్బులు లేవని, ప్రేక్షకులు సినిమా టికెట్లు కొంటేనే తన లైఫ్ సాగుతుందని గతంలో అనంతపురం బహిరంగసభలో వవన్ చెప్పారు. దీనిపై పార్టీ శ్రేయోభిలాషులు పవన్ కు ఓ మెసేజ్ పంపారు. రాజకీయ పార్టీ వద్ద భారీగా నిధులు ఉన్నాయని తెలిస్తేనే ఎవరైనా పోటీకి ముందుకు వస్తారు. లేదంటే సొంత డబ్బులు ఖర్చు చేసుకోవాల్సి వస్తుందని, పార్టీ ఫండ్ ఏమీ రాదని తెలిస్తే పోటీకి ముందుకు రారని చెప్పారు. పార్టీ వద్ద నిధులు ఉన్నా లేకపోయినా భారీగా ఉన్నాయనే భ్రమ అయినా కల్పించాలని సూచించారు. అలా అయితే సొంత ఖర్చులకు తోడు పార్టీ ఫండ్ కూడా ఇస్తే పోటీ సులువు అవుతుందని భావించి ఆశావాహులు పోటీకి సిద్ధపడతారు. లేదంటే చేతి చమురు వదిలించుకున్నా, పార్టీ ఆర్ధిక సహకారం లేకపోతే గెలుపు కష్టమని బరిలో దిగడానికి వెనకడుగు వేస్తారని సన్నిహితులు పవన్ కు గీతోపదేశం చేశారు. ముందు బలమైన అభ్యర్ధులు బరిలో దిగాలని, ఆ తర్వాత ఆటోమేటిక్ గా వాళ్లే ఆర్ధిక వనరులు ఏర్పాటు చేసుకుని దూసుకుపోతారని చెప్పారు. అంతే కానీ నా దగ్గర డబ్బులు లేవు. టికెట్లు కొంటేనే నా పొట్టగడుస్తుంది. అని సినిమా డైలాగులు చెబితే సానుభూతి ఓట్లు పడిపోతాయనుకుంటే పొరపాటని హెచ్చరించారు. ఈ రోజుల్లో ఎన్నికలంటే కోట్లతో వ్యవహారం. ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుందని తమ అనుభవపూర్వకంగా తెలిపారు.
దీంతో పవన్ కూడా విరాళాల బాట పట్టారు. ఎవరైనా స్వచ్ఛంధంగా ఇస్తే పుచ్చుకుంటాం అంటూ ఆయన పార్టీ సోషల్ మీడియా వింగ్ ప్రచారం చేస్తోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త తరం, కొత్త రాజకీయం అని చెప్పుకుంటున్న పవన్ చేస్తున్నదానిలో కొత్తదనం ఏముంది ? అని ప్రశ్నిస్తున్నారు. పాత సీసాలో కొత్త సారా మాదిరిగా జనసేన రాజకీయం ఉంది కదా ? అని విమర్శలు పెరిగిపోతున్నాయి. పార్టీకి విరాళాలు కావాలని బహిరంగంగానే కోరుతున్నారు అంటే…ఇక లోపాయికారిగా ఎవరెంత ఇచ్చుకుంట్ వారికి అన్ని టెకెట్లు అన్న ధోరణికి గేట్లు తీసినట్లే కదా అని అనుమానిస్తున్నారు. లోపాయికారిగా పవన్ తో డీల్ కుదుర్చుకుని చదివింపులు మొదలు పెడితే పార్టీ టికెట్ కన్ ఫామ్ అయిపోయినట్టేనా ? అని ప్రశ్నిస్తున్నారు. ఆర్ధిక వనరుల కోసం విలువలకు తిలోదకాలు ఇచ్చేసినట్టేనా ? విరాళాలు ఇచ్చిన వాళ్లు ఊరికే ఇవ్వరు కదా ? రేపు వాళ్లు ఏదో ఒక ప్రయోజనం ఆశించే అవకాశముంది కదా ? మరి వాళ్లకు ఏం సమాధానం చెబుతారు ? ఏం ఖర్చు చేయకుండా గెలవలేరా ? అని జనసేనన జనం ప్రశ్నిస్తున్నారు. మీరు కూడా ధనరాజకీయాలు చేస్తే ఇంక మీ పార్టీ ఎందుకు ? కొత్తగా మీరు తెచ్చే మార్పు ఏంటని నిలదీస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్పగలరా ?