వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల ఊపు కనిపిస్తోంది. ఇన్ని రోజులూ చర్చల దశలో ఉన్న నేతలు ఇద్దరు అతి త్వరలో వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకొంటూ ఉండగా.. ఇప్పుడు మరో ప్రముఖుడు కూడా చేరికను ధ్రువీకరించాడు. మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆయన బాటలోనే మరోనేత, మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైకాపాలో చేరబోతున్నాడు. ఆయన కూడా ఈ విషయాన్ని ఇదివరకే ధ్రువీకరించాడు.
ఇక ఇప్పుడు జగన్ పార్టీలోకి మరో ప్రముఖుడి చేరిక కూడా ఖరారు అయ్యింది. ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు వైకాపాలోకి చేరబోతున్నారు. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ ను కలిసి ఈ విషయాన్ని ధ్రువీకరించారు సాంబశివరావు. త్వరలోనే తను వైసీపీలోకి చేరబోతున్నట్టుగా సాంబశివరావు ప్రకటించారు.
ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇంకా కాంగ్రెస్ లోని తాలు సరకును కూడా వదలకుండా చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇంకోవైపు జనసేన కూడా రారమ్మని పిలుస్తోంది. అటు అధికార పార్టీ, ఇటు కొత్త పార్టీ వైపు పిలుపులు వస్తున్నా.. వైకాపాలోకి చేరాలనుకోవడంతో చర్చనీయాంశంగా మారింది.
2019 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేయబోతున్నారు. పార్టీ అంతర్గత వర్గాలనుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి.. ఈ విషయం దాదాపుగా ఖరారైనట్టే. కాపు వర్గానికి చెందిన మాజీ డీజీపీ సాంబశివరావు.. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం అనేది.. కాపువర్గం నుంచి వెల్లడయ్యే స్పందనకు ప్రతీకగా వైసీపీకి శుభసంకేతం అని పలువురు భావిస్తున్నారు.
సాంబశివరావు ఒంగోలుకు చెందినవారు. అందుకే ఆయనను ఒంగోలు నుంచే ఎమ్మెల్యేగా బరిలోకి దించుతారనేది సమాచారం. గత ఎన్నికల్లో అయితే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఒంగోలునుచి సాంబశివరావు పోటీ చేయడం గ్యారెంటీ అంటున్నారు. అయితే బాలినేని ఎక్కడనుంచి పోటీచేస్తారనేది తెలియాల్సి ఉంది.
ఒకవేళ ఒంగోలు నుంచి కదలడానికి బాలినేని ససేమిరా ఒప్పుకోక పోయేట్లయితే గనుక… సాంబశివరావును ఒంగోలు ఎంపీగా బరిలోకి దించి, వైవీ సుబ్బారెడ్డిని అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.