కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య వైసీపీలో లాంఛనంగా చేరారు. జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరనంగా ఆహ్వానించారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంతో మనస్తాపం చెందిన రామచంద్రయ్య పార్టీకీ రాజీనామా చేశారు. జనసేనలో చేరుతారనే వార్తలు వచ్చినా అందుకు భిన్నంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో పాదయాత్రలో ఉన్న పార్టీ అధినేత జగన్ సమక్షంలో రామచంద్రయ్య పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయరతో పాటు పెద్ద సంఖ్యలో అనుచరులు పార్టీ కండువా కప్పుకున్నారు.
కడప జిల్లా రాజంపేటకు చెందిన రామచంద్రయ్య బ్యాంకులో చార్టెట్ అకౌంటెంట్ (సీఏ)గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించిన రామచంద్రయ్య.. 1985లో కాంగ్రెస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2008లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిన తరువాత ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారు. దేవాదాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.