క్లారిటీ..జనసేనలోకి బీజేపీ మాజీ ఎమ్మెల్యే..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా ఆయన్ని కలిసేందుకు జనసేన నేతలతో పాటు టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. ఇక పవన్ విశాఖ పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలు జనసేనలో చేరుతారనే వార్త వైరల్‌గా మారింది. అది విశాఖ జిల్లాకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది.

2014 ఎన్నికల్లో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుండి టీడీపీ సపోర్టుతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక అసెంబ్లీలోనూ తనదైన శైలీలో ప్రసంగించడమే కాదు ఛలోక్తులు విసురుతూ అందరిని నవ్విస్తుంటారు. అయితే తర్వాత 2019లో ఒంటరిగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు.

అయితే ఇప్పుడు ఏపీలో జనసేన – టీడీపీ పొత్తు ఖరారు కాగా బీజేపీతో మైత్రి ఉంటుందా లేదా అన్నది కన్ఫామ్ కాలేదు. దీంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆయన జనసేనలో చేరి పోటీ చేయాలనే భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన పవన్‌తో భేటీ కావడంతో పార్టీ మారుతున్నారనే వార్త ఒక్కసారిగా వైరల్‌గా మారింది. టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరకపోతే ఆయన జనసేన నుండి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఇదే స్థానం నుండి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉన్నారు.

ఆయన ఈసారి భీమిలీ టికెట్ ఆశీస్తుండగా ఒకవేళ భీమిలీ దక్కకపోతే విశాఖ ఉత్తరం నుండే పోటీ చేయనున్నారట. ఈ నేపథ్యంలోనే తన ప్రయత్నాలను మొదలుపెట్టారు విష్ణు కుమార్‌ రాజు. మరి పొత్తులో భాగంగా ఆయనకు సీటు దక్కుతుందా లేదా అసలు విష్ణు కుమార్ పార్టీ మారుతారా అన్నది వేచిచూడాలి.