ప్రజా రాజ్యం పార్టీ తరఫున ప్రచారం చేస్తోన్న తనకు కొండగట్టులో ప్రమాదం జరిగిందని, ఆంజనేయుడే తనను కాపాడాడని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అసాధ్యమైన తెలంగాణ కూడా ఆంజనేయ స్వామి దయ వల్ల సుసాధ్యం అయిందని వ్యాఖ్యానించారు. తెలంగాణాలో మూడురోజులపాటు కార్యకర్తలతో సమావేశం ఉంటుందని..తర్వాత ఏపీలో కూడా తన పర్యటనను వెల్లడించారు.
జగిత్యాలలోని కొండగట్టు ఆంజనేయుడి సన్నిధి నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించిన సినీ నటుడు పవన్ కల్యాణ్ అనంతరం కరీంనగర్ వెళ్లి అక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 27 నుంచి అనంతపురం జిల్లాలో తాను పర్యటిస్తానని చెప్పారు.
అలాగే, కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుని సందర్శిస్తానని పవన్ తెలిపారు. తమ పార్టీకి హైదరాబాద్‌లో ఆఫీస్ ఉందని అలాగే, ఏపీలో తన మొదటి ఆఫీసుని అనంతపురంలో ప్రారంభిస్తానని అన్నారు. సమస్యకు పరిష్కారం కావాలే తప్ప గొడవ పెట్టుకుంటే లాభం లేదని చెప్పారు. తమ కార్యకర్తల సలహాలు సూచనలు తీసుకుంటానని అన్నారు. అనంతపురం పర్యటన తరువాత ఇతర జిల్లాల పర్యటన చేస్తానని తెలిపారు. తాను విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించే అవకాశం ఉందని చెప్పారు.