జ‌గ‌న్ ఎంట్రీతో.. టీడీపీలో ప్ర‌కంప‌న‌లు

వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లండ‌న్ ప‌ర్య‌ట‌న ముగించుకొని తిరిగి వ‌చ్చారు. అందులో పెద్ద విష‌య‌మేమి ఉంద‌నుకుంటున్నారా? ఉంది. రోజుకోక‌రు చొప్పున వైఎస్ఆర్‌సీపీలో చేరిన టీడీపీ నేత‌లు.. వారం రోజులుగా సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు జ‌గ‌న్ తిరిగి రావ‌డంతో వలసల జోరు మరోసారి సాగనుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీలోని ముఖ్య నేతలు వైఎస్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మరికొంత మంది వెయిటింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

జ‌గ‌న్ స‌మ‌క్షంలోనే పార్టీలో చేరాల‌ని చాలామంది నేత‌లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో జ‌గ‌న్ రాష్ట్రంలోకి అడుగుపెట్ట‌ర‌న‌గానే టీడీపీల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. గోదావరి జిల్లాలకు చెందిన ఓ ఎంపీ, కోస్తా జిల్లాలకు చెందిన కొందరు టీడీపీ నేతలు వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అంతేగాక‌ మోదుగుల వేణుగోపాలరెడ్డి టీడీపీకి రామ్ రామ్ చెప్తార‌న్న‌ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

మాగుంట శ్రీనివాసరెడ్డి, వల్లభనేని వంశీమోహన్‌ కూడా జంప్‌జిలానీ లిస్టులో ఉన్నారని… తమవైపు రావడానికి ఇరవైమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆసక్తి చూపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓపెన్ గా ప్రకటిస్తున్నారు. మ‌రి ఏం జ‌ర‌గ‌బోతుందో వేచి చూడాలి మ‌రి.