ఏపీ సీఎం చంద్రబాబుకి కర్నూలు జిల్లాలో బిగ్‌షాక్ తగలనుందా..? చూస్తుంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే సీనిర్‌నేత చల్లా రామకృష్ణారెడ్డి బాబుకే పెద్ద షాక్ ఇచ్చారు. ఆయన పార్టీ మారేయోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నామినేటేడ్ పోష్ట్ ల విషయంలో బాబుపై చల్లా ఆగ్రహంగా ఉన్నారు.
చంద్రబాబు తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పదవే చల్లా కోపానికి కారణమైంది. పదవి ఇవ్వకపోయినా బాధపడే వాడిని కాదని.. కానీ ఇంత చిన్న పదవి ఇచ్చి తనను హేళన చేశారని ఆయన రగిలిపోతున్నారు. తన కన్నా జూనియర్ నాయకులైన వర్లా రామయ్యకు ఆర్టీఛైర్మెన్ పదవి … చల్లా రామకృష్ణారెడ్డికి మాత్రం ఆర్డీసీ కడప రీజియన్ చైర్మన్ పదవి ఇచ్చారని బాబుపై చల్లా మండిపడ్డారు.
తనకిచ్చిన పదవిని చేపట్టబోనని స్పష్టం చేశారు. క్రమశిక్షణ, నిబద్ధతతో పార్టీ కోసం పనిచేసిన తనకు మరీ ఇంత చిన్న పదవి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఒకే పార్లమెంట్ పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ట్రాక్ రికార్డు తనకు ఉందన్నారు. సీమలో చంద్రబాబు, కేఈ తర్వాత తానే అత్యంత సీనియర్ నేతనని చెప్పారు. అలాంటి తనకు ఇచ్చే గౌరవం ఇదేనా అని చల్లా ప్రశ్నించారు.
టిడిపిలో చేర్చుకునేటపుడే తనకు ఎంఎల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పినట్లు మండిపడ్డారు. అడుగడుగునా అవమానిస్తున్న టిడిపిలో కొనసాగటంపై చల్లా తీవ్ర ఆలోచనలో ఉన్నట్లు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఆయన త్వరలోనే వైసీపీ తీర్థంపుచ్చుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.