ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది చంద్రబాబుకు కొత్త తలనొప్పి మొదలైంది. ఎప్పుడైతే కేసీఆర్‌లా ముందే అభ్యర్థులను ప్రకటిస్తానని అనౌన్స్ చేశాడో… అప్పటి నుంచి ఆశావాహులంతా ఆయన చుట్టు తిరగడం ప్రారంభించారు. ఇటీవలే కడప జిల్లాలో మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి గ్రూపుల మధ్య కిందా మీద పడి సయోధ్య కుదర్చిన చంద్రబాబు ముందుకు ఇప్పుడు కొత్త పంచాయతీ వచ్చి పడింది.
విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబును అమరావతిలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. అందులో పెద్ద విశేషమేముంది.. ఆయన ఒక్కరు వస్తే ఏం లేదు.. కానీ ఆయన ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగూర్ మీరాను నాని తన వెంట తీసుకొచ్చారు. ఈ నాగూర్ మీరా విజయవాడ పశ్చిమ అసెంబ్లీ టికెట్‌ను ఆశించే వారిలో ప్రథమ స్థానంలో ఉన్నారు. ఈ విషయాన్నే నాని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.
ఆ ఏముంది ఇచ్చేస్తే పోలా.. అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇటీవల చంద్రబాబును కలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన కుమార్తె షబానా ఖాతూర్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. అది కూడా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలుపొందిన విజయవాడ పశ్చిమ సీటును కుమార్తెకు ఇవ్వాలన్నారు. లోపల చంద్రబాబు ఏం హామీ ఇచ్చారో తెలీదు కానీ.. షబానా మాత్రం మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ సీటుపై ఏపీ సీఎం తమకు హామీ ఇచ్చారని అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు నాని.. నాగూర్ మీరాకు సపోర్ట్‌గా చంద్రబాబును కలిశారు. ఇప్పుడు చంద్రబాబు నెత్తిన మరో పంచాయతీ మొదలైనట్టే. ఈ దీనిని ఎలా తెములుస్తారో వేచి చూడాలి.