ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత జగన్‌పై మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రెండో విడత పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీసీ కులసంఘాలు, ఆటో యూనియన్లు, బ్రాహ్మణ సమాఖ్య, మేధావుల ఫోరం తదితర సంఘాలతో పవన్ భేటీ అయ్యారు.
బాబు, జగన్‌లు ఇద్దరూ రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారని మండి పడ్డారు. సమాజాన్ని విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. మనమంతా మనుషులుగా ఉన్నా కులాలుగా విడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్లు పెట్టి బీసీలకు అన్యాయం జరుగుతుందంటున్నారని విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై బీసీ కులాలకు లాభనష్టాలు వివరించాలని అన్నారు. కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడాల్సి వస్తే టీడీపీలో ఉన్న కాపు నాయకులు ఏం చేస్తున్నారు? అలాగే, ప్రతి బీసీ కులంలో ఉన్న నాయకులు వాళ్ళ వాళ్ల కులాల కోసం ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
‘జనసేన’ ప్రశ్నించే పార్టీ అని నేనెప్పుడూ చెప్పలేదు. ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి పార్టీ బాధ్యత. కానీ, చాలామంది ఏం చేశారంటే.. ‘జనసేన’ను ప్రశ్నించే పార్టీగా పరిమితం చేస్తే అధికారం ఇంకొకరి ఇవ్వొచ్చనే ఆలోచనను బలంగా తీసుకెళ్లారు. ఒక తప్పు లేదా అన్యాయం జరుగుతున్నప్పుడు ముందుగా ప్రశ్నిస్తాం…‘జనసేన’ ప్రశ్నించే పార్టీ అని చెబుతూ పార్టీ పరిమితిని తగ్గించారు’ అని పవన్ అన్నారు.