పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా మంది సినిమా వాళ్ళకు ఆదర్శం అయ్యాడు అన్నది నిజం. అంతకుముందు వరకూ కూడా రాజకీయాల్లోకి వెళ్తే సినిమా హీరోలుగా ఉన్నప్పుడు ఎగ్గొట్టిన పన్ను వ్యవహారాలు, అక్రమ వ్యాపారాల లిస్టులన్నీ బయటపెట్టి అధికారంలో ఉన్నవాళ్ళు ఇబ్బందులు పెడతారన్న భయం సినిమా హీరోలకు ఉండేది. పదవులపై ఆశలు ఉన్నప్పటికీ చాలా మంది ఇలాంటి భయాలతోనే రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే పవన్ మాత్రం ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం కనుక్కున్నాడు. అధికారంలో ఉన్న పార్టీలు, నాయకుల భజన చేస్తూ కూడా రాజకీయం చెయ్యొచ్చని నిరూపించాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రజలు అష్టకష్టాల్లో ఉన్నారు…… కానీ చంద్రబాబు, కెసీఆర్‌లు మాత్రం అత్యద్భుతంగా పరిపాలిస్తున్నారు అని చెప్పడం పవన్‌కే చెల్లింది. ఇక ప్రజా సమస్యలపై పోరాడవేంటి అని ప్రశ్నిస్తే కూడా పవన్ దగ్గర బాద్యత లేని సమాధానం ఒకటి ఉంది. నా దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారా? ఎంపిలు ఉన్నారా? అని ఎదురు ప్రశ్నిస్తాడు. మరి 2014 ఎన్నికల్లో బాబు, మోడీల కోసం ప్రచారం చేసినప్పుడు, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్నప్పుడు నీకు ఆ విషయం తెలియదా…… ఏ నమ్మకంతో మోడీ, బాబులు అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజల తరపున ప్రశ్నిస్తా…… పోరాటం చేస్తా అని ప్రజలకు హామీ ఇచ్చావు అంటే మాత్రం తనదైన స్టైల్‌లో ఓ నవ్వు నవ్వేస్తాడు పవన్. హామీలు ఇచ్చినవాళ్ళే మోసం చేయగాలేనిది…..వాళ్ళ కోసం ప్రచారం చేసిన నేను మాటతప్పితే పెద్ద నేరమా అన్నట్టు ఉంటుంది పవన్ వ్యవహారం.
2019లో కూడా అదే బాధ్యత లేని రాజకీయానికి తెరలేపుతున్నాడు పవన్.25 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపి సీట్లు కావాలని చెప్పి నియోజకవర్గాల లిస్టుని చంద్రబాబుకు పంపించాడు పవన్. ఈ సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకుంటే ఇప్పటి నుంచీ 2019 ఎన్నికల సమయం వరకూ బాబుకు ఉపయోగపడేలా రాజకీయం చేస్తూ ఉంటాడు పవన్. అంటే ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదు? ప్రజల సమస్యలు పట్టవా అని జగన్‌ని నిలదీస్తూ ఉంటాడు. అదే సమయంలో మోడీతో అష్టకష్టాలు పడుతూ బాబు పోరాటం చేస్తున్నాడని…….ఈ టైంలో ఇంకెవరు అధికారంలో ఉన్నా బాబును మించి ఏమీ చేయలేరని మాటలు చెప్తూ ఉంటాడు. నాకు రాజకీయ స్వార్థం లేదని, బాబుకు భజన సేనుడుని కాదని……అవసరమైతే జగన్‌తో కూడా కలిసి పోరాటం చేస్తానని మాట వరసకు అంటాడు. 2019 ఎన్నికల్లో మాత్రం ఎంచక్కా బాబుతో కలిసి మరోసారి ప్రజలను మోసం చేయడానికి రెడీ అయిపోతాడు. ఇందులో ఇంకో విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయడట. నాకు పదవుల ఆశలేదు అని ప్రచారం చేసుకుంటాడట. అయితే విశ్లేషకులు మాత్రం ఎలాగూ ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం లేనప్పుడు ఎమ్మెల్యే పదవి ఎందుకు అన్నది పవన్ ఆలోచనగా చెప్తున్నారు. అధికారికంగా ఏ పదవీ తీసుకోకుండా ఉంటే…….తెరవెనుక ప్యాకేజీలు, బోలెడన్ని లాభాలతో 2019 తర్వాత కూడా గొప్ప రాజకీయం చెయ్యొచ్చని…….2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుర్చీకి పోటీ చెయ్యొచ్చన్నది పవన్ వ్యూహంగా చెప్తున్నారు. వాటే రాజకీయం సర్ జీ…….ఏది ఏమైనా ఏ పోరాటమూ చేయకుండా…….అన్ని విధాలుగా లాభపడుతూ కూడా రాజకీయం చెయ్యొచ్చని మాత్రం పవన్ నిరూపించాడన్నది మాత్రం నిజం.