పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజాసేవకోసమే రాజకీయాల్లోకి వచ్చాడా? వ్యక్తిగత స్వార్థానికి సంబంధించిన ప్రయోజనాలు ఏమీ లేవా? లేవనే పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చంద్రబాబు భజన చేస్తున్నాడు కాబట్టి ఎల్లో మీడియా కూడా పవన్ మగానుభావుడు అన్నట్టుగానే కథలు కథలుగా చెప్తూ ప్రజలను నమ్మించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ జనసేన పార్టీ పెట్టిన తర్వాతనే పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేనంతగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేస్తున్నాడన్నది నిజం. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌ల కంటే పవనే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. అలాగే పవన్ సినిమాలకు చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సాయం చేస్తోంది. ఇక బ్రాండ్ అంబాసిడర్స్ నియామకాలు, టిటిడి బోర్డ్‌లో నియామకాలతో సహా ప్రభుత్వం చేత పవన్ కళ్యాణ్ చేయించుకుంటున్న పనులు అన్నీ ఇన్నీ కావు. అన్నింటికీ మించి ప్యాకేజ్ కళ్యాణ్ అంటూ రాజకీయ మేధావులే విమర్శలు చేస్తున్నారు.
అవన్నీ కూడా గిట్టని వాళ్ళ విమర్శలే అనుకుంటే ఇప్పుడు ఏకంగా టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌నే పవన్ వ్యవహారాలు బయటపెట్టాడు. మరో సూపర్ స్టార్ మహేష్ బాబుకు స్వయాన బావ కూడా అయిన గల్లా జయదేవ్ ప్రజా ప్రయోజనాల కంటే కూడా ఆయన వ్యాపార ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని ఆ మధ్య ఒక సారి పవన్ కళ్యాణ్ విమర్శించాడు. ఇప్పుడు పవన్ మాటలపై స్పందించిన జయదేవ్……తాను వ్యాపారంలో బాగా సంపాదించుకుని ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నానని…….కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సంపాదన కోసమే రాజకీయాల్లోకి వచ్చాడన్నట్టుగా తీవ్రస్థాయిలో విమర్శించేశాడు జయదేవ్. మొత్తానికి ఈ వ్యవహారం అంతా కూడా తొడుదొంగలు ఒకరిగురించి ఒకరు బయటపెట్టుకున్నట్టుగా ఉందని సోషల్ మీడియాలో ఘాటు కౌంటర్స్ పడుతున్నాయి.