రాజకీయాల్లో సీరియస్ గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతుంటారు. అల్లరి పనులు, చిల్లర వేషాలు రాజకీయాల్లో ఉండకూడదంటారు. ఎంత నవ్వు వచ్చినా దాచుకోవడానికే ఆయన ప్రయత్నిస్తుంటారు. గంభీరంగా ఉంటేనే ప్రజలకైనా, పార్టీ శ్రేణులకైనా నాయుకులపై సదభిప్రాయం కలుగుతుందని భావిస్తుంటారు. అందుకే వీలైనంత ఎక్కువగా హుందాగా వ్యవహరించాలని ఆయన ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులకు హెచ్చరిస్తుంటారు. ప్రజా జీవితంలో ఉన్నవారిపై అందరి కళ్లు ఉంటాయని, ప్రజాప్రతినిధుల జీవితాలను ప్రజలు నిశితంగా గమనిస్తుంటారు కనుక మనం బాధ్యతతో వ్యవహరించాలని చెబుతుంటారు చంద్రబాబు. ఆయన చెప్పింది ముమ్మాటికీ నిజమే. ప్రజాప్రతినిధుల వేషభాషలే కాదు ప్రతి అంశాన్నీ రాజకీయ ప్రత్యర్ధులతో పాటు జనం నిత్యం గమనిస్తుంటారు. ఏ మాత్రం హుందాగా వ్యవహరించకపోయినా విమర్శలతో విరుచుకుపడుతుంటారు.
ఇప్పుడు చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ తీరుపైనా నెటిజన్లు అలానే విమర్శలు సంధిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం నాటి నుంచీ శివప్రసాద్ సహా టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లోపల బయట ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలోనూ పదే పదే నినాదాలు చేస్తూ దేశం దృష్టిని ఆకర్షించే పనిలో ఉన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చాలని ఎంపీలు తమ వాదనను వినిపిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రముఖ పార్టీల నేతలకు తమ గోడు అర్ధమవ్వాలని ఇంగ్లిష్, హిందీలోనూ తమ తంటాలేవో తాము పడుతున్నారు. సీరియస్ గానే తాము మోడీ సర్కార్ పై పోరాడుతున్నామనే మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదే వారి ఆలోచన.
అయితే అదే సమయంలో చిత్తూరు ఎంపీ రోజుకో వేషధారణతో పార్లమెంట్ బయట హడావుడి చేస్తున్నారు. నేడు శ్రీరాముడి వేషం వేశారు. రామభక్తులమని చెప్పుకునే బీజేపీ నేతలు రాముడిలా ఒకే మాట, ఒకే బాణం, అనే ధర్మాన్ని ఎందుకు పాటించడం లేదని ఘాటుగా విమర్శించారు. రామరాజ్యం ఏర్పాటు చేస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ రాజధర్మాన్ని మరిచి ఏపీకి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు శివప్రసాద్. ఏపీ విషయంలో అన్యాయం చేయడం తగదని హెచ్చరించారు. అంతవరకూ బాగానే ఉంది కానీ ఇలా వేషాలు వేయడం వల్ల టీడీపీ నేతలకు సీరియెస్ నెస్ లేదనే విమర్శలు తప్పడం లేదు. వివేకానందుడు, సాయిబాబా, మాయల ఫకీరు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వేషాలు వేయడం వెనుక, నటనపై, ఆయా పాత్రలపై తనకున్న మక్కువ తీర్చుకుంటున్నట్లు ఉందే తప్ప నిజంగా సీరియస్ గా మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నట్లు లేదనే ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. పైగా శివప్రసాద్ అడపదడపా సినిమాల్లో నటిస్తూ నటనపై తనకుండే అభిలాషను నెరవేర్చుకుంటున్నారు. మరి నిజజీవితంలోనూ రాజకీయాల్లోనూ ఇలా వేషాలు వేయడం వల్ల సీరియస్ నెస్ తగ్గిపోతుందని ఏపీ ప్రజలు విమర్శిస్తున్నారు. గత సమావేశాల సందర్భంగా మహిళ వేషధారణలో శివప్రసాద్ తన నిరసన తెలిపారు. ఆ వేషధారణ గురించి టీడీపీ ఎంపీలను అడిగి మరీ పగలబడి నవ్వుకున్నారు స్పీకర్ సుమిత్రా మహాజన్. ఆమె నవ్వడంలో తప్పులేదు. ఇలా రోజుకో వేషం వేస్తే ఇలాగే నవ్వుకుంటారు తప్ప మీ పోరాటన్ని గుర్తించరని జనం హెచ్చరిస్తున్నారు. విచిత్ర వేషధారణలతో నవ్వించడం కాదు మీరు నవ్వులు పాలుకాకుండా చూసుకోండని పవన్ కళ్యాణ్ కూడా సూచించారు. ఆ వేషాలు వేయకుండా పోరాడితే మంచి ఫలితాలు వస్తాయి కదా అని శివప్రసాద్ శ్రేయోభిలాషులు చెబుతున్నారు. మరి ఆయనేమంటారో..?