ఈ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు తమదేనని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఊహల్లో విహరిస్తున్నారు కూడా. ఇటీవల టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల బ్యాంక్ అంకౌంట్లలో పదివేల రూపాయల చొప్పున జమ చేసింది. పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి మహిళల అకౌంట్లలోకి మనీ ట్రాన్సఫర్ చేశారు. మొదటి విడత 2,వేల 5వందలు, రెండో విడత 3,వేల 500 ఇప్పటికే చాలామంది డ్వాక్రా మహిళల అంకౌంట్లలో జమ అయిపోయాయి. ఇక ఏప్రిల్ మొదటి వారంలో మూడో విడత మిగిలిన 4 వేల రూపాయలు జమ కానున్నాయి. ఇలా టీడీపీ ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధి పొందిన డ్వాక్రా మహిళల సంఖ్య అక్షరాలా 97లక్షల మందికిపైనే ఉన్నారు. వాళ్లంతా సంతోషంగా ఉన్నారని, తమ ఓట్లు నూటికి నూరు శాతం టీడీపీకే వేస్తారని లెక్క చెబుతున్నారు.
ఇక పెంఛన్ లబ్ధిదారులు 51 లక్షల మంది ఉన్నారు. వీళ్లందరికీ 2వందల రూపాయల పెన్షన్ ను చంద్రబాబు 2వేలకు పెంచారు. గత ఫిబ్రవరి, మార్చి నుంచి పెంచిన పింఛన్లు 51 లక్షల మంది లబ్ధిదారులు అందుకుంటున్నారు. ఇక ఏప్రిల్ 11 పోలింగ్ కు పది రోజుల ముందు ఏప్రిల్ 1న కూడా వాళ్లంతా మూడోసారి పింఛన్ అందుకుంటారు. ఆ కృతజ్ఞతతో కచ్చితంగా టీడీపీకే ఓటు వేస్తారు. అన్నది టీడీపీ నేతల, అభిమానుల ఆశ. పైగా మళ్లీ గెలిపిస్తే 3వేల రూపాయలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. దీంతో ఆ 51 లక్షల మంది పింఛన్ లబ్ధిదారుల ఓట్లు తమవేనని చెప్పుకుంటున్నారు.
అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు 51 లక్షల మందికి పైగా ఉన్నారు. ఐదెకరాల లోపు ఉన్నవారికి మోడీ ప్రభుత్వం ఇస్తున్న 6వేల రూపాయలకు మరో 9వేల రూపాయలు కలిపి టీడీపీ ప్రభుత్వం మొత్తం 15వేల రూపాయలు ఇస్తోంది. ఐదు ఎకరాలు దాటిన వారికి 10 వేల రూపాయల చొప్పున ఇస్తోంది. ఆ డబ్బులు కూడా దాదాపు 75 నుంచి 80 శాతం మంది రైతుల అకౌంట్లలో ఇప్పటికే మొదటి విడత వెయ్యి రూపాయలు జమ అయ్యాయి. మిగిలిన డబ్బులు కూడా విడతల వారీగా జమ కానున్నాయని ప్రచారం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో డ్వాక్రా మహిళలు 97 లక్షల మంది, పింఛన్ దారులు 51 లక్షల మంది, అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు 51 లక్షల మంది మొత్తం 2 కోట్ల మంది ఓట్లు కచ్చితంగా తమకే పడతాన్నది టీడీపీ నేతల, అభిమానుల మాట. ఏపీలో మొత్తం 3 కోట్ల 87 లక్షల ఓట్లు ఉండగా, అందులో ఇప్పటికే ఈ 2 కోట్ల ఓట్లు టీడీపీకి ఫిక్స్ అయిపోయినట్టేనన్నది వారి ఆశ. ఇక మిగిలిన కోటీ 86 లక్షల్లో అన్ని పార్టీల కంటే తమకు అధికశాతం ఓట్లు ఉన్నాయన్నది వారి లెక్క. దీని ప్రకారం చూస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం అని తెలుగుదేశం శ్రేణులు ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి.
అయితే వారి లెక్కలో ఓ తప్పు కనిపిస్తోంది. డ్వాక్రా మహిళలు, పింఛన్ లబ్ధిదారులు, అన్నదాత సుఖీభవ లబ్ధిదారులను టీడీపీ శ్రేణులు పూర్తిగా వేరువేరుగా చూపిస్తున్నాయి. ఈ మూడు కేటగిరీల్లో లబ్ధి పొెందిన వాళ్లు ఒకరే అయిన సందర్భాలున్నాయి. ఉదాహరణకు డ్వాక్రా మహిళగా లబ్ధి పొందిన వాళ్లే అన్నదాత సుఖీభవ ద్వారా కూడా లబ్ధి పొందుతున్నారు. పింఛన్ అందుకున్న వాళ్లే డ్వాక్రా గ్రూపుల్లోనూ ఉంటున్నారు. పించన్ లబ్ధి దారులే అన్నదాత సుఖీభవ ద్వారా లబ్ధి పొందుతున్నారు.
ఇలా మూడు పథకాల్లోనూ ఒక్కరే ఉన్న సందర్భాలు కనిపిస్తున్నాయి. సో అలాంటప్పుడు టీడీపీ చెబుతున్న లెక్క తప్పే అవకాశముంది. పైగా ఈ మూడు పథకాల్లో లబ్ధి పొందుతున్న వారు కూడా అనేక మంది ఇతర పార్టీల అభిమానులున్నారు. వాళ్లు ఎలాంటి అభిమానులంటే కరడుకట్టిన అభిమానులు, చంద్రబాబు ఇంటిలోది ఇవ్వట్లేదు కదా…మన సొమ్మే మనకు ఇస్తున్నారు…అంటూ కొందరు ఇతర పార్టీల అభిమానులైన లబ్ధిదారులు వాదిస్తున్నారు.
నాలుగున్నరేళ్లకు పైగా డ్వాక్రా మహిళలు, రైతులు, పింఛన్ లబ్ధిదారులు గుర్తు రాలేదా ? ఇప్పుడే ఈ ఎలక్షన్ టైంలోనే గుర్తుకొచ్చామా ? ఎలక్షన్ అయిపోగానే ఇస్తారనే గ్యారంటీ ఏంటి ? అని నిలదీస్తున్నవారూ ఉన్నారు. సో ఇలాంటి వాదనలు, లెక్కలు విన్న తర్వాత టీడీపీ నేతల్లో ధీమా సడలుతోంది. డ్వాక్రా మహిళలు, పింఛన్ లబ్ధిదారులు, అన్నదాత సుఖీభవ లబ్ధిదారులైన 2 కోట్ల మందిలో తమ ఓట్ల లెక్క కచ్చితంగా తేలేది ఎలాగబ్బా అని మళ్లీ కొత్త లెక్కలేసుకునే పనిలో పడ్డారు.