2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ గా కలిసున్న రెండు తెలుగు రాష్ట్రాలు.. ఆ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక పరచబడి కొత్త రాష్ట్రంగా అవతరించింది. అయితే అప్పుడు రాష్ట్రాన్ని సరైన విధానంలో విభజించలేదని అప్పటి యూపీఏ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి . ముఖ్యంగా రాష్ట్రం విభజించిన తరువాత ఏపీకి తీవ్ర అన్యాయమే జరిగింది. అన్నీ రంగాల్లోనూ అభివృద్ది చెందిన హైదరబాద్ తెలంగాణకు వెళ్లిపోయింది. దీంతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. విభజన హామీల ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరబాద్ పెదేళ్లు ప్రకటించబడినప్పటికి అది నామమాత్రమే. దాంతో ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటికీ కూడా రాజధాని విషయంలో తర్జన భర్జన పడుతూనే ఉంది. .
ఇదిలా ఉంచితే కొత్తగా ఏపీ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలవాలి అని కోరుకోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. ” విభజన చట్టం అసంబద్దం అని మళ్ళీ ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా కలిసి ఉండాలన్నదే తమ పార్టీ విధానం అని చెప్పుకొచ్చారు. తమ పార్టీ మొదటి నుంచి కూడా వ్యతిరేకంగానే ఉందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనను తీరును సవాల్ చేస్తూ ఉండవెల్లి అరుణ్ కుమార్ ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మాట్లాడుతూ సజ్జల పై విధంగా స్పందించారు. అయితే సజ్జల వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యానారాయణ కూడా సమర్థించారు.
రెండు తెలుగు రాష్ట్రాలు కలవడంలో తమకేలంటి అభ్యంతారాలు లేవని చెప్పుకొచ్చారు. దీంతో ఏపీ ప్రభుత్వ నేతలు ఇలా స్పందించడం ఏంటని ఈ అంశంపై రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఏపీ ప్రభుత్వ నేతల వ్యాఖ్యలను తెలంగాణ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు సమసిపోయిన అంఖాన్ని ఇప్పుడు తెరపైకి తేవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరువాత మళ్ళీ తిరిగి కలవడం అసాధ్యం అని తెలంగాణ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి అనవసర విషయాలపై పెట్టె దృష్టి ఏపీ అభివృద్దిపై పెట్టండి అని తెలంగాణ వైఎస్ఆర్ అధినేత్రి వైఎస్ షర్మిల ఏపీ సర్కార్ పై తీవ్రంగా మండి పడ్డారు.
తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్, టిఆర్‌ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ వంటి ఎంతో మంది తెలంగాణ నేతలు సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయితే సజ్జల అవసరం లేని ఈ కొత్త అంశాన్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారనే వాదన బలంగా నడుస్తోంది. ప్రస్తుతం తెలంగాణతో పాటు ఏపీని కూడా కుదిపేస్తున్నా లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలు ఇలాంటి అనవసర అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారనేది పోలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న మాట. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలు కలవడం అసాధ్యమైనప్పటికి.. అన్నీ తెలిసిన ప్రభుత్వ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ కోణం తప్పా ఇంకోటి కాదు అనేది కాదనలేని వాస్తవం.