Sunday, May 4, 2025
- Advertisement -

దేవుడి ఎదుటకు మరో టీడీపీ ఎమ్మెల్యే!

- Advertisement -

తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో మొదలైన ప్రమాణాల పర్వం విశాఖపట్నానికి తాకింది. వైసీపీ, తెలుగుదేశం నాయకులు ఇక్కడ కూడా విమర్శలు ప్రతివిమర్శలతో రెచ్చిపోవడంతో దేవుడే సాక్షిగా మారాడు. విశాఖపట్నం తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు భూ కబ్జాలు చేశారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు పరస్పర విమర్శల దాడికి దిగుతున్నారు. వైసీపీ నేతల ఆరోపణలపై దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తానని, వైసీపీ నేతలు కూడా ప్రమాణం చేయాలని వెలగపూడి సవాల్‌ విసిరారు.

ఈ నేపథ్యంలో వైసీపీ నాయకురాలు విజయనిర్మల సాయిబాబా చిత్రపటంతో ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. తాను రమ్మన్నది విజయసాయిరెడ్డినని ఎమ్మెల్యే వెలగపూడి పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి వస్తే ప్రమాణం ఎక్కడ చేయమన్నా చేస్తానని వెల్లడించారు. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదని ఎమ్మెల్యే వెలగపూడి స్పష్టం చేశారు. ‘నేను విజయసాయిరెడ్డికి సవాలు విసిరితే మధ్యలో వీళ్లంతా ఎవరు. ఆరోపణలు కాదు దేవుడి ఎదుట ప్రమాణం చేయమన్నాను’అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నానని, సింహాచలం వచ్చి ప్రమాణం చేయాలని వైసీపీ నేతలు అంటున్నారని.. ఆ సవాలు స్వీకరిస్తున్నానని.. అక్కడ ప్రమాణం చేయడానికి విజయసాయిరెడ్డి వస్తారా? అని ఎమ్మెల్యే వెంగలపూడి ప్రశ్నించారు. ఇక ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణ నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ నేతల మధ్య ప్రమాణ సవాళ్లతో విశాఖ అట్టుడుకుతోంది. భూకబ్జాలపై విజయసాయిరెడ్డి స్వయంగా ప్రమాణం చేయాలంటూ.. టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -