తెలంగాణలో రాజన్న పాలన తీసుకు వస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించారు వైఎస్ షర్మిల. ఇప్పటికే నిరుద్యోగ సమస్యలపై ఆమె పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ల విషయంపై ఓ పత్రికలో వచ్చిన వార్తలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆరేళ్లలో కట్టిన ఇళ్లు కేవలం లక్ష లోపేనని, వాటిని సైతం లబ్ధిదారులకు కేటాయించడంలో సర్కారు తీవ్ర జాప్యం చేస్తోందని ఆ కథనంలో పేర్కొన్నారు.
నాగర్ కర్నూల్, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదని పేర్కొన్నారు. అంతే కాదు కట్టించిన డబుల్ బెడ్ రూమ్ లు మెయింటెనెన్స్ లేక దెబ్బతింటున్నాయన్న అంశాలను షర్మిల ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలో ‘3 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కడుతమని.. చెప్పి 6 ఏండ్లయినా లక్ష కూడా కట్టలే, ఇచ్చినవి వేలల్లో కూడా లేవు, ఒకవైపు కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూలిపోతున్నా.. లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నా.. పేదలకు ఇండ్లు ఇచ్చింది లేదు, ఆత్మగౌరవ ఇండ్లు పేదలకు అందాలంటే ఎన్నికలు రావాలా?.. కేసీఆర్ దొర’ అంటూ తన ట్విట్టర్ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.