ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. చాన్నాళ్ల తర్వాత మీడియాముందుకు వచ్చిన షర్మిల బాబుపై విమర్శలు గుప్పించారు. టీడీపీని గెలిపిస్తే మరో ఐదేళ్లు రాష్ట్ర ప్రజలు భాదపడాల్సి వస్తుందన్నారు. బాబు కారణంగా ఇప్పటికే రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని షర్మిల విమర్శించారు. ఏపీలో భూతద్దం పెట్టి వెతికినా ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు.అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టిన ఐదు సంతకాలను కూడ చంద్రబాబునాయుడు నీరుగార్చారని షర్మిల విమర్శించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలకు ఓ భరోసా ఉండేదన్నారు. వైఎస్సార్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదని, అలాగే పేద విద్యార్థులకు కూడా పెద్ద చదువులు చదివేవారని వైఎస్ షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన బాబు అవన్నీ తుంగలోకి తొక్కారని విమర్శించారు.
రైతులను డ్రాక్రామహిళలకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పిన బాబు వారిని మోసం చేశారన్నారు. నేను వైఎస్సార్ కూతురుగానే కాకుండా సామాన్యురాలిగా మాట్లాడుతున్నానన్నారు. ఏపీలో రూ.84,000 కోట్లుగా ఉన్న రైతుల రుణాలను రూ.24,000 కోట్లకు కుదించారని వ్యాఖ్యానించారు. పేదలు ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్లాలని చంద్రబాబు శాసించారని షర్మిల చెప్పారు. అనారోగ్యం వస్తే చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికే వెళతారా అని ప్రశ్నించారు.
ప్రజల కోసం కాకుండా పదవుల కోసమే చంద్రబాబునాయుడు హామీలు గుప్పిస్తారని ఆమె విమర్శించారు. చంద్రబాబునాయుడు నిప్పు కాదు.. తుప్పు అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుుడు హాయంలో అవినీతి పెరిగిపోయిందని ఆమె విమర్శించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ పాలన సాగిస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు.