వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆపార్టీ సీనియర్‌నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాడు కాంగ్రెస్ హైకమాండ్ ను విభేదించి, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ‘ఛరిష్మా’ వచ్చిందన్నారు. అంతకుముందు ఆ ఛరిష్మా లేదని వైసీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు అన్నారు.
సోనియాగాంధీ అంతటి వ్యక్తిని నాడు ఎదిరించి బయటకొచ్చిన జగన్మోహన్ రెడ్డి, తన తల్లితో కలిసి సొంతపార్టీ ఏర్పాటు చేశారు. తన సిద్ధాంతాలకు అనుకూలంగా ఉన్న వారిని తన పార్టీలో చేరమని ఆయన కోరారు. ఇంకొకరి ఛరిష్మాతో జగన్ రాలేదు. నాడు ఎన్టీఆర్ కు ఫిల్మ్ యాక్టర్ అని చెప్పి ఛరిష్మా రాలేదు. ఆరోజున ఇందిరాగాంధీ లాంటి గొప్పవ్యక్తిని ఆయన వ్యతిరేకించారు. ఇందిరాగాంధీని వ్యతిరేకించే శక్తులన్నీ ఎన్టీఆర్ వద్ద చేరిన కారణంగానే ఆయన అంత గొప్ప వ్యక్తి అయ్యారన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఛరిష్మాటిక్ లీడర్ షిప్ లేదు. కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలకు అనుగుణంగా పని చేసుకుంటూ, సుదీర్ఘ రాజకీయ పోరాటం చేసుకుంటూ ఆయన ఎదిగారు. అలాగే, చంద్రబాబునాయుడు గారు కూడా. ఆయనకు పర్సనల్ ఛరిష్మా లేదు. ఎన్టీఆర్ వారసత్వాన్ని తీసుకుని, మేనేజ్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి’’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.