గుంటూరు జిల్లాలోని గురజాలలో విపక్ష ,అధికార పార్టీ నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్, వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి.ఇటీవల ఓ బహిరంగ సభలో యరపతినేని వైఎస్సార్‌సీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ తొడకొట్టిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వారలబ్బాయ్ అంటూ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై యరపతినేని విమర్శలు చేశారు. 2022, 2023లో జిమిలి ఎన్నికలు వస్తాయని.. అన్నింటికీ బదులిస్తామంటూ వైఎస్సార్‌సీపీ నేతలను యరపతినేని హెచ్చరించారు.
తాజాగా యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలకు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణలా మీసాలు తిప్పడం, బ్రహ్మానందంలా తొడలు కొట్టడం కుదరదని ఆయన అన్నారు. యరపతినేని తొడకొడితే ఆయన ఇంట్లో చంటోళ్లు కూడా భయపడరని ఎద్దేవా చేశారు. యరపతినేని భావిస్తున్నట్లుగా జమిలి ఎన్నికలు రావని, ఒకవేళ వచ్చినా..2025, 2026లో ఆ ఎన్నికలు జరుగుతాయన్నారు. శాసన సభ ఎన్నికలు కూడా ఆలస్యమవుతాయని.. ఈ విషయం తెలిస్తే టీడీపీ వాళ్ల గుండె ఆగుతుందన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేనంటూ లోకేష్ కూడా ఇటు వస్తారేమో అని ఎద్దేవా చేశారు.