కేంద్రంపై అవిశ్వాసం నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి బాబుపై విమర్శలు గుప్పించారు. తెలంగాణాలోని ముంపుమండలాలను ఏపీలో కలపకపోతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనని చెప్పిన బాబు ప్రత్యేకహోదా విషయంలో అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. గత నాలుగేళ్లుగా ఏపీ ప్రజలనను మోసం చేసింది చంద్రబాబేన్ననారు.
హోదాపై తమ అధినేత జగన్ చేసిన అలుపెరుగని పోరాటాన్ని కూడా చంద్రబాబు హేళన చేశారని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ అప్పుడు డ్రామాలాడి… ఇప్పుడు మాట మార్చారని ఎద్దేవా చేశారు. క్రెడిట్ మొత్తం వైసీపీకి వస్తుందనే భయంతో… కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇచ్చేవారికే వైసీపీ మద్దతు ఇస్తుందనే విషయాన్ని తాము స్పష్టంగా చెప్పామని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పిన బీజేపీతో కలసి తాము వెళ్లబోమని చెప్పారు.
ప్రత్యేహోదాకు ఎవరు మద్దతు ఇస్తారో వారితో కలిసి పోరాడాతామని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, గల్లా జయదేవ్ హిమాచల్ ప్రదేశ్‌లో ఎందుకు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. 90 వేల కోట్ల రాష్ట్ర అప్పును రెండు లక్షల కోట్లకు చేసింది మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవమేనా? అని చంద్రబాబును ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధికి తాము గర్వపడుతున్నామని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.