వైఎస్ఆర్‌సీపీలో కొత్త ముసలం ఏర్పడినట్టు తెలుస్తోంది. గోలు ఎంపీ టికెట్ విషయంలో వైఎస్ జగన్ తేల్చేసినట్టు సమాచారం. దీనికి దానికి ఏం సంబంధం అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు మతలబు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వలేనని తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి జగన్ స్పష్టం చేశారని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి త్వరలో వైఎస్ఆర్‌సీపీలో చేరబోతున్నారు. ఆయనకే ఎంపీ టికెట్ ఇస్తానని జగన్ స్పష్టం చేసినట్టు సమాచారం.
ఇక ఈ విషయాన్ని వారితో వీరితో చెప్పించడం కాకుండా… నేరుగా వైవీ సుబ్బారెడ్డికే జగన్ చెప్పేశారని సమాచారం. దాంతో ఆయన అలక పాన్పు ఎక్కారట. అందుకే టికెట్ నిరాకరించారన్న కోపంతోనే వైవీ సుబ్బారెడ్డి… జగన్ గృహప్రవేశ కార్యక్రమానికి కూడా హాజరుకాలేదు. ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్… బంధుత్వాల ఆధారంగా టికెట్లు ఇచ్చేందుకు సుముఖంగా లేరు. మాగుంట శ్రీనివాస రెడ్డి పార్టీలోకి వస్తే ఒంగోలు ఎంపీ సీటును ఈజీగా గెలవడంతో పాటు, ప్రకాశం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసేందుకు అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నారు. మరోవైపు కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ గెలుపుమీద మాగుంట కుటుంబం ప్రభావం తప్పక ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే వైవీని పక్కనపెట్టి మాగుంటకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. త్వరలోనే మాగుంట వైఎస్ఆర్‌సీపీలో చేరుతారని ఓ వర్గం మీడియా ఇప్పటికే వార్తలు రాయడం ప్రారంభించింది.