2019 ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు అని అడిగిన ఒక జాతీయ మీడియా సంస్థతో చంద్రబాబుకంటే జగన్‌కి పది శాతం ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ జనాలు ఓట్లేశారు. ఈ లిస్టులో పవన్ మరీ వెనుకబడి ఉన్నాడు. అయితే ఈ ఒక్క అంశంతో పాటు 2019 ఎన్నికల్లో విజేతను నిర్ణయించే అంశాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఒక ఆసక్తికర అంశం ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాతో పాటు తెలుగు మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెనాలి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచీ ఈ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ సారి కూడా అదే రిపీట్ అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. 2004, 09లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గెలిచారు. ఆ రెండు పర్యాయాలు వైఎస్సార్ సారథ్యంలో కాంగ్రెస్ గెలిచింది. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలిచారు. టిడిపి అధికారంలోకి వచ్చింది. ఈ సారి జనసేన తరపున తాజాగా ఆ పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్ పోటీపడడం ఖాయం. జనసేనలో కంటే ముందు ఈయన వైకాపాలో చేరాలని ప్రయత్నం చేశారు. అయితే 2014 ఎన్నికల్లో తక్కువ మార్జిన్‌తో ఓడిపోయిన అన్నా బత్తిన శివకుమార్‌కే ఈ సారి కూడా టికెట్ ఖాయం అని చెప్పాడు జగన్.
2014లో ఓడిన తర్వాత నుంచీ ప్రజల మధ్యనే ఉండడం, విద్యాధికుడు, కాస్త మంచి పేరు ఉన్నవాడు కావడంతో అభ్యర్థిని మార్చడానికి జగన్ ఒప్పుకోలేదు. అందుకే నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరాడు. అయితే నాదెండ్ల మనోహర్‌కి జనసేన తరపున గెలిచేంత సామర్థ్యం లేదు అన్నది ఓపెన్ ఫ్యాక్ట్. అలాగే టిడిపి అభ్యర్థిగా మరోసారి తలపడనున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై ఇప్పటికే తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. రుణమాఫీ హామీలతో పాటు చంద్రబాబు చేసిన మోసాలు, ఆలపాటి కూడా నియోజకవర్గంలో కనీసం అందుబాటులో లేకుండా పోయిన పరిస్థితుల నేపథ్యంలో వైకాపా అభ్యర్థి అన్నాబత్తిన శివకుమార్ భారీ మెజార్టీతో ఇక్కడ నుంచి గెలవడం ఖాయమని విశ్లేషకులు చెప్తున్నారు. సర్వేల్లో కూడా అదే విషయం బయటపడుతోంది. ఈ నియోజకవర్గం నుంచి వైకాపా గెలుపు ఖాయం అన్న సర్వే రిపోర్ట్స్ నేపథ్యంలో సెంటిమెంటుగా 2019 ఎన్నికల్లో వైకాపా విజయం ఖాయమని, జగన్ సిఎం అవుతాడని స్థానిక తెనాలి ప్రజలు కూడా జాతీయ స్థాయి మీడియా సంస్థలతో బహిరంగంగా చెప్తూ ఉండడం ఈ నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితిని తెలియచేస్తోంది.