జనసేన పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రజా క్షేత్రంలో పర్యటనలు చేస్తున్నాడు. పవన్ మాట్లాడుతున్న అన్ని మాటలూ కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే తనను హత్య చేసి ఉండేవారు అంటూ పవన్ మాట్లాడిన మాటలు నిజమా? పవన్ కళ్యాణ్‌ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? జగన్ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే తనను చంపేసి ఉండేవాళ్ళు అన్న పవన్ మాటల వెనుక ఆంతర్యం ఏంటి? పవన్ వెనుక కుట్రలు పన్నుతున్నది ఎవరు? ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి కదా? రేపటి నుంచి ఎల్లో మీడియాలో ఇలాంటి రాతలు కనిపించాలన్నదే పవన్ కళ్యాణ్ ఉద్ధేశ్యం కూడా. వైఎస్‌ల ప్రజాదరణను తట్టుకోలేక వైఎస్ కుటుంబంపైన బాబు అండ్ ఆయన భజన బ్యాచ్ ఏ స్థాయిలో విషయం చల్లారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్‌లను ఆదరిస్తున్నారన్న ఒకే ఒక్క కసితో పులివెందుల ప్రాంతాన్ని, రాయలసీమను చంద్రబాబు ఏ స్థాయిలో అవమానించాడో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయా ఆరోపణల్లో నిజాలు ఉన్నాయా? లేవా? అనే విషయాన్ని ఈ విశ్లేషణ చదివి మీరే అర్థం చేసుకోండి.
పరిటాల రవిని హత్య వెనకాల వైఎస్ జగన్, జేసీ దివాకర్‌రెడ్డి ఉన్నారని ఆయన భార్య పరిటాల సునీతతో సహా చంద్రబాబునాయుడితో పాటు ఆయన భజన మీడియా బృందం, మేధావులమని ముసుగేసుకున్న పచ్చ బ్యాచ్ అందరూ కూడా నానా రచ్చ చేశారు. చంద్రబాబు నాయుడితో ఆ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేలా చేశాడు. వైఎస్‌ల పైన ఫ్యాక్షన్ ముద్ర వేయడంతో పాటు దేశంలోని అందరు నాయకులు వైఎస్‌లకు దగ్గర కాకూడదన్న వ్యూహంతో గొప్పగా ప్రచారం చేశాడు చంద్రబాబు. చంద్రబాబుతో పాటు పరిటాల సునీత, బాబు భజన మీడియా వార్తలన్నీ నిజమే అయితే పరిటాల రవిని చంపిన జేసీ దివాకరరెడ్డిని టిడిపిలో ఎలా చేర్చుకున్నారు. ఆ కుటుంబానికి ఒక ఎంపి పదవి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు ఎలా ఇచ్చారు? తన భర్తను హత్య చేసినవాళ్ళతో సహచర సభ్యురాలిగా పరిటాల సునీత ఎలా మాట్లాడుతున్నారు? పరిటాల రవి హత్య జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ అంతటా బస్సుల తగుల బెట్టడం నుంచీ, ధర్నాలు బంద్‌లతో బీభత్సం సృష్టించిన వాళ్ళందరూ ఇప్పుడు జేసీ కుటుంబంతో ఎలా రాసుకుపూసుకు తిరుగుతున్నారు? పరిటాల రవి హత్యకు గురైనప్పుడు రాష్ట్రంలో ఏ స్థాయిలో బీభత్సం సృష్టించారో ప్రత్యకేంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి వైఎస్ రాజశేఖరరెడ్డి హత్య వెనకాల ఎవరున్నారు? ఎవరు చేయించారు అని కూడా చాలా వార్తలే వచ్చాయి. ఆ వార్తల్లో ఉన్న కొంతమంది నాయకులు, వ్యాపారస్తుల మధ్య ఏ స్థాయి సంబంధాలు ఉన్నాయో ఈ రోజుకీ కూడా మన కంటికి కనిపిస్తూనే ఉంది. మరి వైఎస్ జగన్ ఏనాడైనా సంయమనం కోల్పోయాడా? ఎవరినైనా రెచ్చగొట్టాడా? రచ్చకెక్కాడా? అలాగే వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రిని చంపినవాళ్ళను కూడా చంద్రబాబు దగ్గర చేస్తే తాను ఏనాడూ ఏమీ మాట్లాడలేదని వైఎస్ రాజశేఖరరెడ్డి చాలా సార్లు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. రాజారెడ్డిని చంపిన వాళ్ళపై ఎలాంటి దాడులూ జరగలేదన్నది అందరికీ తెలిసిన నిజం. హత్యలు చేసే నైజమే ఉంటే తాతను చంపినవాళ్ళు కళ్ళ ముందు తిరుగుతుంటే, తండ్రిది ప్రమాదం కాదు, హత్య అన్న బలమైన ఆరోపణల నేపథ్యంలో ఏ నాయకుడు అయినా సైలెంట్‌గా ఉంటాడా? కనీసం రెచ్చగొట్టే ఆరోపణలు చేయకుండా ఉంటాడా? అలా కాకపోయినా సానుభూతి ఓట్ల కోసం అయినా సెంటిమెంట్ మాటలు చెప్పడా? కానీ జగన్ ఏ రోజూ అలాంటి ప్రయత్నం చేయలేదు.
ఇక పవన్ కళ్యాణ్ గుండు వ్యవహారం పక్కనపెడదాం. ఇదే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది ఫంక్షన్‌లో ఏం మాట్లాడాడు? తన సినిమా లీక్ అవడం వెనకాల కుట్ర ఉందని చెప్పాడు. ఆ కుట్ర వెనకాల ఎవరున్నారో కూడా తనకు తెలుసని చెప్పాడు. వాళ్ళెవరో చెప్పమని అభిమానులు ఆవేశంగా అడిగితే……ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు చెప్తా….ఎవ్వరినీ వదలను అన్నాడు. మరి ఇంకా ఆ సమయం రాలేదా? లీకేజీ వెనకాల కుట్ర ఏంటో? ఆ కుట్ర ఎవరో పవన్ చెప్పగలడా? చెప్పలేడు. ఎందుకంటే అసలు అక్కడ కుట్రేలేదు. కానీ పవన్ కళ్యాణ్‌కి ఇలాంటి రెచ్చగొట్టే రాజకీయాలు బాగా ఇష్టం. అభిమానుల్లో సెంటిమెంట్ రాజేయడం, వాళ్ళను రెచ్చగొట్టడం తనపై సానుభూతి వచ్చేలా చేసుకోవడం…….తను చేస్తున్న తప్పులు, భజన రాజకీయం వాళ్ళకు అర్థం కాకుండా చేయడం పవన్ స్టైల్. మొత్తంగా తన సినిమాలు తాను చేసుకుంటూ, కోటాను కోట్ల రెమ్యూనరేషన్స్ తీసుకుంటూ అప్పుడప్పుడూ ప్రజా సేవ, పోరాటం అంటూ షో చేసే పవన్ ఇలాంటి సెంటిమెంట్ డ్రామాలతోనే ఫ్యాన్స్‌ని మూర్ఖులను చేస్తున్నాడు. పంజా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ చేసింది కూడా అదే. కష్టపడి పైకొచ్చిన చిరంజీవి, ఎన్టీఆర్‌లు కూడా ఏ రోజూ పవన్ స్థాయిలో కష్టం గురించి చెప్పుకోని ఉండరు. తీరా చూస్తే పవన్ చేసేవన్నీ రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలే. ఇక పవన్ యాక్టింగ్ గురించి పవనే చాలా సార్లు చెప్పుకున్నాడు. తనకూ ఏమీ చేతకాదని.
2014లో టిడిపి అధికారంలోకి రాకపోయి ఉంటే తనను చంపేసి ఉండేవాళ్ళు అని చెప్పడం పవన్ నీచ రాజకీయానికి పరాకాష్ట. మానవత్వం గురించి గొప్పగా మాట్లాడే పరోక్షంగా జగన్ గురించి ఇంత అమానవీయంగా మాట్లాడడం దారుణం. 2014లో టిడిపి అధికారంలోకి రాకపోయి ఉండి ఉంటే జగన్ అధికారంలోకి వచ్చి ఉండేవాడు అన్న విషయం చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఇక పవన్ ఎవరి గురించో మాట్లాడితే జగన్ పార్టీ వాళ్ళు భుజాలు తడుముకున్నారని ఎటకారం చేసే మూడాభిమానుల వైఖరి ఇంకా దారుణం. అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్‌ని చంపాల్సిన అవసరం ఏం ఉంటుంది? అసలు నాయకుడిగా జగన్‌కి పోటీ ఇచ్చే స్థాయిలో పవన్ ఉన్నాడా? చిరంజీవి, పవన్‌లు ఇద్దరూ పోటీపడితే పట్టుమని పద్దెనిమిది సీట్లు తెచ్చుకున్నారు. ఇక పవన్ సొంతంగా పోటీచేస్తే పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదు. సర్వేలు కూడా కేవలం రెండు శాతం ఓటింగ్ ఉందని చెప్పారు. అదే జగన్ పార్టీ టిడిపి, బిజెపిలాంటి బలమైన పార్టీలు, పవన్ కళ్యాణ్‌తో పాటు టిడిపి భజన మీడియాను తట్టుకుని ప్రతిపక్ష స్థానాన్ని సాధించాడు. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యాడు. అలాంటి జగన్ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే అసలు పవన్‌ని పట్టించుకుంటాడా? జగన్ ఏనాడైనా పవన్‌ని సీరియస్‌గా తీసుకున్నాడా? అయినప్పటికీ పవన్ మాత్రం జగన్‌ని రాక్షసుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు, బాబు భజన మీడియా తరపున వకాల్తా పుచ్చుకుని పచ్చి అబద్ధాలు చెప్పాడు.
పార్టీ పెట్టిన మరుక్షణం నుంచీ ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ పోరాటం చేస్తున్నాడు జగన్. ప్రజాదరణను పెంచుకుంటూ ఉన్నాడు. ఇక ప్రత్యర్థులు మాత్రం ఇలాంటి నీచమైన మాటలు, రాక్షస రాతలతో కుట్రలతో రెచ్చిపోతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి…….ఎవరిది కుట్ర రాజకీయం? ఎవరికి మానవత్వం లేదు? ఎవరు నిజంగా ప్రజల తరపున పోరాడుతున్నారు?