ఏపీతో పాటు.. తెలంగాణలో పొలిటికల్ “గోపి”లు… చాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో.. చాలామంది సీనియర్లు రాజకీయ భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నారు. విభజనకు ముందు కాంగ్రెస్ లో చక్రం తిప్పి.. ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిన చాలా మంది నాయకులు.. పక్క చూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు రీసెంట్ గా ఏపీలో… ఆనం రామనారాయణరెడ్డి చేసిన కామెంట్లే కొందరు ఆధారంగా చూపిస్తున్నారు.
కాకపోతే.. బొత్స రూట్ లో ప్రతిపక్ష వైసీపీలో చేరాలా.. లేదంటే.. అధికార పార్టీ టీడీపీని నమ్ముకుని వెళ్లాలా అన్నది అర్థం కాక.. డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు, రాజకీయ అవసరాలు లేకపోవడంతో కాస్త ఆలోచించుకుని అడుగులు వేయాలన్నది నేతల ఆలోచనగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆనం ఏదో ఒక రూట్ డిసైడైతే.. మరింత మంది కాంగ్రెస్ నేతలు గుట్టుగా ప్లాట్ ఫామ్ సెట్ చేసుకునేందుకు రెడీ అవుతున్న సిగ్నల్స్ వస్తున్నాయి.
ఇక.. తెలంగాణలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ లో చాలా మంది నాయకులు చేరిపోయారు. ఇటు హరీష్ రావు, అటు కేటీఆర్ నాయకత్వంలో చేరికలు కూడా పోటాపోటీగా జరిగిపోతున్నాయి. ఇదే మంచి టైమ్ గా భావిస్తున్న మరికొందరు కాంగ్రెస్, టీడీపీ నేతలు.. త్వరలోనే గులాబీ తీర్థం పుచ్చుకోడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఓవరాల్ గా… ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాల్లో.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల కారణంగా.. నేతలు దిక్కులు చూస్తున్నారు. ఏ వైపు వెళ్తే వ్యక్తిగతంగా, రాజకీయంగా రెండు వైపులా లాభం ఉంటుందో లెక్కగట్టి మరీ ప్లాట్ ఫామ్ రెడీ చేసుకుంటున్నారు. ఈ లెక్కలన్నీ తేలితే.. ముందు ముందు మరింత మంది ఉన్న పార్టీల నుంచి గోడదూకడం ఖాయంగా కనిపిస్తోంది.