ముఖ్యమంత్రి తనయుడు… బహుశా ఇంతకు మించిన పవర్ ఫుల్ హోదా, గ్లామరస్ టచ్ ఇంకోటి ఉండదేమో! తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకుకు అంతకు మించిన అదృష్టం ఉండదు కాబోలు! వరసగా జగన్ మోహన్ రెడ్డిని, నారా లోకేష్ బాబులను చూస్తుంటే ఈ అభిప్రాయం కలుగుతోంది. ఈ హోదాను జగన్ కన్నా నారా లోకేష్ బాబునే ఎక్కువ సద్వినియోగం చేసుకొంటున్నాడని కూడా ఇక్కడ అనుకోవాల్సి వస్తోంది!
జగన్ పై సీబీఐ పెట్టిన కేసుల విషయంలో వైకాపా వారు ఒక వాదన వినిపిస్తారు. క్విడ్ ప్రో కో అంటున్నారు కదా.. జగన్ ఏనాడైనా సెక్రటేరియట్ కు వెళ్లాడా? ఏమంత్రిపైనైనా ఒత్తిడి తీసుకు వచ్చాడా? ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి అలా ఏమైనాప్రయత్నించాడా? అంటూ వారు వాదిస్తారు. జగన్ ఎక్కడో బెంగళూరులో ఉండి వ్యాపారాలు చేసుకొంటుంటే.. ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తెచ్చి తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించాడని ఎలా ఆరోపిస్తారు.. అని వైకాపా వాళ్లు, వైఎస్ అభిమానులు అంటారు.
మరి నారా లోకేష్ బాబు తీరును చూస్తుంటే.. భవిష్యత్తులో టీడీపీకి ఈ మాత్రం ఛాన్స్ కూడా ఇచ్చేలా లేరు! ఏపీ ప్రభుత్వ సెక్రటేరియట్ లో నారా లోకేష్ లైజనింగ్ ఆఫీసర్లను నియమించారు. ప్రతి మంత్రి పేషీలోనూ లోకేష్ బాబు మనిషి ఒకరు ఉంటారు. వారే లైజనింగ్ ఆఫీసర్, ఆ పేషీలోకి ఎవరెవరు వస్తున్నారు.. అక్కడ ఏం జరుగుతోంది? అనే విషయాల గురించి సమాచారం ఇవ్వడమే వీరి బాధ్యత!
వీరిని లోకేష్ ప్రత్యేకంగా నియమించాడట. మరి లోకేష్ ముఖ్యమంత్రి కాదు.. మంత్రి కాదు.. అయినా.. ఇలా సెక్రటేరియట్ లో మనుషులను నియమించుకొన్నాడటంటే.. ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయడంలో చాలానే ఎదిగిపోయాడను కోవాల్సి వస్తోంది! రేపు ఏవైనా వివాదాలు వస్తే.. క్విడ్ ప్రో కో ఆరోపణలు వస్తే.. ఇలాంటి లైజనింగ్ అధికారుల వ్యవహారం లోకేష్ కు ప్రమాదకరంగా మారగలదు!