చివరి బడ్జెట్‌లో కూడా చిప్ప చూపించిన మరుక్షణం నుంచీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బిజెపి-టిడిపిలపై తీవ్ర స్థాయి వ్యతిరేకత వచ్చిందన్నది నిజం. 2014లో కాంగ్రెస్‌కి పట్టిన గతే టిడిపి-బిజెపిలకు కూడా పడుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా బాబుకు స్పష్టం చేశాయి. ఆ వెంటనే చంద్రబాబు అలర్ట్ అయ్యాడు. పాపం మొత్తాన్ని బిజెపిపైకి నెట్టేశాడు. తన కోసం పనిచేసే పవన్, జెపిలాంటివాళ్ళతో షో చేయించడంతో పాటు పచ్చ మీడియా సాయంతో బిజెపిని మాత్రమే దోషిగా నిలబెట్టడంలో చంద్రబాబు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. మరి చంద్రబాబును మించిన వ్యూహకర్త అని రాజకీయ విశ్లేషకులు చెప్పే నరేంద్రమోడీ ఎందుకు మౌనంగా ఉన్నట్టు? మోడీ, అమిత్ షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపిని ఎందుకు గాలికొదిలేశారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు చాలా మందిలో మెదులుతున్నాయి. బిజెపి నేతలు కూడా ఇదే విషయం మోడీ, అమిత్ షాల దగ్గర ప్రస్తావించారట. అప్పుడు మోడీ చెప్పిన విషయాలు బిజెపి నేతలను కూడా షాక్‌కి గురిచేశాయి.
ఆంధ్రప్రదేశ్‌కి ఎంత చేసినా చంద్రబాబు ఇంకొకరికి ప్రచారం దక్కే అవకాశం ఎప్పుడూ ఇవ్వడు. చంద్రబాబు సన్నిహితులు సోనియా ప్రధాన కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో రెండేళ్ళుగా సన్నిహితంగా ఉన్నారు. బిజెపికి జాతీయ స్థాయిలో నష్టం చేకూర్చి….2019లో ఎవరికీ మెజారిటీ రాని పక్షంలో తాను జాతీయ స్థాయిలో వెలిగిపోవాలని చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండు ఎంపి సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్‌లో బిజెపిని బ్రతికించాలని చేసే ఏ ప్రయత్నమైనా వృథా ప్రయాసనే. అదే ప్రయత్నం ఇతర రాష్ట్రాల్లో చేస్తే బెటర్. అధిష్టానం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో చేసే ప్రయత్నాలు ఏమీ ఉండవు. అలా చేస్తే మీడియా బలం ఎక్కువగా ఉన్న బాబు ఇంకాస్త రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. స్వార్థ రాజకీయాల కోసం మనం కూడా అదే స్థాయిలో రెచ్చిపోతే జాతీయ స్థాయిలో పరువుపోగొట్టుకున్నవాళ్ళం అవుతాం. బాబు కోసం పనిచేసే మీడియా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించడంలో సక్సెస్ అవ్వొచ్చు గానీ జాతీయ స్థాయి మీడియాకు, విశ్లేషకులకు మాత్రం చంద్రబాబుకు సోనియాకు ఉన్న సన్నిహిత సంబంధాలు బాగా తెలుసు. చంద్రబాబు స్థాయి రాజకీయాలు మనం చేసి జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకోవడం కంటే మనం ఆంధ్రప్రదేశ్‌కి ఏం చేయాలో అది చేద్దాం. అక్కడ వచ్చే నష్టాన్ని ఇతర రాష్ట్రాల్లో భర్తీ చేసుకుందాం……ఇవీ బిజెపి నేతలకు అమిత్ షా, మోడీ చెప్పిన మాటలు. ఇదే సందర్భంలో వైఎస్ మరణం, కిరణ్ కుమార్‌రెడ్డి హయాంలో సోనియాతో చంద్రబాబు సన్నిహిత సంబంధాల గురించి కూడా చర్చకు వచ్చిందని తెలుస్తోంది. ఆ తర్వాతే ‘మహానేతను భూ స్థాపితం చేసి అధికారంలోకి వచ్చారు’ అన్న మాట ఒక బిజెపి నాయకుడి నోటి నుంచి వచ్చింది. తాజాగా చంద్రబాబు చర్యల నేపథ్యంలో బిజెపి నేతలు ఇప్పుడు ఇవే విషయాలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఓ వైపు బిజెపితో కలిసి ఉంటూనే మరోవైపు సోనియాతో కలిసి రాజకీయం చేయాలనుకున్న బాబు వ్యూహాలు రాష్ట్రానికి కూడా భారీగా నష్టం చేశాయన్నది నిజం. ఈ వ్యూహాలన్నీ వ్యక్తిగతంగానూ, అధికార స్వార్థం విషయంలోనూ చంద్రబాబుకు ఏ స్థాయిలో కలిసొస్తాయో చూడాలి మరి.