బీసీసీఐ కొత్త ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ)లో భాగంగా 2019-2023 మధ్య అన్ని ఫార్మాట్లలో భారత్ 81 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుందని వెల్లడించారు. ప్రస్తుత ఎఫ్‌టీపీతో పోలిస్తే 30 మ్యాచ్‌లు ఎక్కువని పేర్కొన్నారు. కొత్త ప్యూచర్ ప్రోగ్రామ్‌లో భాగంగా భారత్ రెండు ఐసీసీ మెగా టోర్నీలకి ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమైంది. 2021లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2023 వన్డే ప్రపంచకప్ భారత్ గడ్డపైనే జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ సోమవారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
గతంలో భారత్ 1987, 1996, 2011 వన్డే ప్రపంచకప్‌లకి ఆతిథ్యమిచ్చింది. అయితే ఈసారి 2023 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్, శ్రీలంకని భాగస్వామ్యం చేయకుండా ఆతిథ్య హక్కుల్ని మొత్తం భారత్ తన వద్దే ఉంచుకునేలా బీసీసీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది.
2013లోనే ఈ హక్కులకి సంబంధించిన ఒప్పందం జరగగా.. అందులో భాగంగా దక్కించుకున్న 2016 టీ20 ప్రపంచకప్ టోర్నీని సమర్థంగా నిర్వర్తించి భారత్ పేరు నిలబెట్టుకుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచకప్‌ని మరింత ఆకర్షనీయంగా నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.