భారత క్రికెట్ జట్టు బుధవారం ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. బలమైన టాపార్డర్.. నమ్మదగ్గ మిడిలార్డర్.. అండగా ఆల్‌రౌండర్లు.. మెగా టోర్నీలోనే అత్యుత్తమ బౌలింగ్ దళం.. ఇన్ని అనుకూలతల మధ్య టీమ్‌ఇండియా సానుకూలంగా తొలి మ్యాచ్‌కు రెడీ అయితే.. వరుస పరాజయాలు, గాయాల బెడద, బ్యాట్స్‌మెన్ ఫామ్‌లేమి ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతున్న సఫారీలు ఇబ్బందికర పరిస్థితుల్లో బరిలోకి దిగనున్నారు.
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయిన సఫారీలు ఒత్తిడితో బరిలోకి దిగుతున్నారు. భారత్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2019 సీజన్ నేపథ్యంలో.. వారం రోజులు ఆలస్యంగా వరల్డ్‌కప్‌లో టీమిండియా తన ప్రయాణాన్ని ఆరంభిస్తోంది. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ నాలుగు సార్లు భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడగా.. మూడింట్లో సఫారీలు విజయం సాధించారు. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే టీమిండియా విజయం సాధించింది.
దక్షిణాఫ్రికా ఆటగాల్లను గాయాలు వెంటాడుతున్నాయి. జట్టు ప్రధాన బలమైన డేల్ స్టెయిన్ గాయం కారణంగా పూర్తి వరల్డ్‌కప్‌కు దూరం కాగా… మరో స్టార్ పేసర్ ఇంగిడి గాయం కారణంగా మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయారు. ఈ మ్యాచ్‌లో గెలిచి గాడిలో పడాలని సఫారీలు చూస్తున్నారు.
భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రాహుల్, ధోనీ, కేదార్ జాదవ్, హర్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, చాహాల్, బుమ్రా
దక్షిణాఫ్రికా జట్టు: డి కాక్, హషీమ్ ఆమ్లా, డుప్లిసిస్, దుస్సెన్, డేవిడ్ మిల్లర్, డుమినీ, ఫెల్కూవాయో, క్రిస్ మోరిస్, కసిగో రబాడా, ఇమ్రాన్ తాహీర్, తబ్రాయిజ్ షంశీ